గత యేడాది డిసెంబర్ 30న విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీని కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ఆమీర్ ఖాన్ ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నాడు. దాంతో అదే తేదీపై ‘జెర్సీ’ నిర్మాతలు ఇప్పుడు కర్చీఫ్ వేశారు. అయితే ఇదే తారీఖున పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కూడా విడుదల కావాల్సి ఉంది.
ఏదేమైనా తెలుగులో నాని హీరోగా రూపుదిద్దుకున్న ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశాడు మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి. దీన్ని హిందీలో అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీలతో కలిసి అమన్ గిల్ నిర్మించాడు. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ని షాహిద్ కపూర్ హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అది అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో సహజంగానే ‘జెర్సీ’ హిందీ రీమేక్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
