Samantha: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం ‘శాకుంతలం’. భారత సినీ ప్రేక్షకులు 2023లో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్ ఈ మూవీ. అందాల సుందరి సమంత ఇందులో టైటిల్ రోల్ ను ప్లే చేస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమగాథను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. దీన్ని స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథ ఇది. ఇందులో శకుంతలగా సమంత దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి ఈ సినిమాను 3డీలో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను డా. ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా పోషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. గుణ శేఖర్ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ రీ-రికార్డింగ్‌ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ చేయటం విశేషం.
