వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని కిరణ్ పై అయన బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ ను అరెస్ట్ చేసారు. ఆ వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు దాసరి కిరణ్. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసారు పోలీసులు.
Also Read : Mega Star : స్టాలిన్ రీరిలీజ్.. వాషౌట్.. ట్రెండ్ కు ఇక ముగింపు పలకాల్సిందే
తాజాగా దాసరి కిరణ్ పై మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. గాజుల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ పై రెండు కేసులు నమోదు చేసారు. అలాగే హైదరాబాద్ ప్రగతి నగర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై మరో కేసు నమోదు చేసారు. కిరణ్ తమ వద్ద రూ. 58 లక్షలు తీసుకుని స్థలం అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే కిరణ్ దాడి చేశాడని ఫిర్యాదు చేసారు శివ కుమార్. మరోవైపు హైదరాబాద్ రాజేంద్ర నగర్ కు చెందిన కోట శశికాంత్ రూ. 53 లక్షలు అప్పుగా ఇవ్వగా తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని, డబ్బులు తిరిగి అడిగినందుకు తన అనుచరులతో కిరణ్ దాడి చేశాడని ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసారు. ఇప్పుడు కిరణ్ పై నమోదు చేసిన కేసుల సంఖ్య 5కు చేరుకుంది. వరుస ఫిర్యాదులు రావడంతో కిరణ్ పై కేసులు పెట్టిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.