Pramod Kumar: సీనియర్ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్ (87) విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. 38 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆయన 300లకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. అందులో 31 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. అలానే నటుడిగా కొన్ని చిత్రాలలో అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు ‘దొంగ పోలీస్’తో పాటు ‘గరం మసాలా’ చిత్రాన్ని మిత్రులతో కలిసి నిర్మించారు. అలానే ‘సుబ్బయ్య గారి మేడ’ పేరుతో ఓ నవల రాశారు. ఆయన తన సినిమా అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ పేరుతో గ్రంథస్థం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారానికి ఎంపికైంది. వ్యక్తిగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఆయన తన బాధ్యతలను నిర్వర్తించారని, తమ వంశ చరిత్ర విశిష్టతను అక్షరాలోకి మార్చి గ్రంథస్థం చేశారని ప్రమోద్ కుమార్ తనయుడు శ్రీనివాస్ రాయ్ తెలిపారు. ప్రమోద్ కుమార్ కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.