NTR – Krishna: కొత్త సంవత్సరం చిత్రసీమకు అచ్చిరాలేదు. సీనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకరి తర్వాత ఒకరు చిత్రసీమను వీడి దివికేగుతున్నారు. జమున, కె. విశ్వనాథ్ మరణవార్తలను ఇంకా పూర్తి స్థాయిలో జీర్ణించుకోకముందే… ఈ రోజు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన మధురగాయని వాణి జయరాం కన్నుమూశారు. ఆమె మరణానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. ఇదే సమయంలో మరో మరణవార్త దక్షిణాది సినీ అభిమానులను విషణ్ణ వదనులను చేసింది. ఎన్టీయార్, కృష్ణతో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, కృష్ణంరాజు, చిరంజీవితో ‘పులి-బెబ్బులి’ చిత్రాలను తీసిన సీనియర్ తమిళ నిర్మాత ఆర్. వి. గురుపాదం బెంగళూరులో ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
నాలుగైదు దశాబ్దాల క్రితమే సినీ సంగీత విభాగంలోకి ఆర్. వి. గురుపాదం అడుగుపెట్టారు. ఆ తర్వాత సంగీత దర్శకులతో ఉన్న సాన్నిహిత్యంతో మ్యూజిక్ కండక్టర్ గా ఎదిగారు. దక్షిణాదిలోని అగ్ర నటీనటుల చిత్రాలకు పనిచేశారు. ఆపైన నిర్మాతగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇరవైకు పైగా సినిమాలను నిర్మించారు. పలు చిత్రాలను ఇతర భాషల నుండి అనువదించారు. ‘సత్యవాది హరిశ్చంద్ర’ పేరుతో ఓ టీవీ సీరియల్ నిర్మించారు. సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్, తమిళ, కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లోనూ సభ్యులుగా ఉన్న గురుపాదం మూడు రోజుల క్రితమే చెన్నయ్ లో నిర్మాతల సమావేశానికి హాజరయ్యారని సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నయ్ లో ఆర్. వి. గురుపాదం అంత్యక్రియలు జరుగుబోతున్నాయి. ఆయనకు దాదాపు ఎనభై సంవత్సరాలు. దక్షిణాది చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.