NTV Telugu Site icon

Rajini : బంధం వేసిన రజనీ’గంధం’!

చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా నటించేసి విజయాలను మూటకట్టుకున్నారామె. నాటి వర్ధమాన కథానాయకుల చిత్రాలలోనూ నాయికగా రజనీ అందం గంధాలు పూసింది.

రజనీ అసలు పేరు శశి కౌర్ మల్హోత్ర. 1965 మార్చి 2న బెంగళూరులో జన్మించారు. చిన్నతనం నుంచీ చలాకీగా ఉన్న రజనీ అందం సినిమా జనాన్ని ఆకర్షించింది. అలా చిత్రసీమలో చోటు సంపాదించారామె.
రజనీ అందం మందంగా ఉన్నా నటనలో ఎంతో ఈజ్ ఉండేది. నవ్వులు పూయించిన సన్నివేశాలు, కన్నీరు పెట్టించిన సందర్భాలు, ఇలా ఏది తన దరికి చేరినా, ఇట్టే నటించేసి మార్కులు కొట్టేసేవారు రజనీ. బాలకృష్ణతో ఆమె నటించిన “భార్యాభర్తలబంధం, సీతారామకళ్యాణం, రాము”వంటి సూపర్ హిట్ మూవీస్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.

ఇక నాగార్జునకు తొలి గ్రాండ్ సక్సెస్ గా నిలచిన ‘మజ్ను’లోనూ తరువాత బంపర్ హిట్ ‘కలెక్టర్ గారి అబ్బాయి’లోనూ, ఆపై మురిపించిన ‘మురళీకృష్ణుడు’లోనూ రజనీయే నాయిక. ఇక వెంకటేశ్ కు మంచి విజయాన్ని అందించిన ‘బ్రహ్మపుత్రుడు’లోనూ, అర్జున్ హిట్ మూవీ ‘ప్రతిధ్వని’లోనూ, రాజేంద్రునికి ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘అహ నా పెళ్ళంట’లోనూ రజనీ అందచందాలు జనాన్ని మురిపించాయి. రజనీ కెరీర్ లోనూ అన్నీ విజయాలే కాదు, కొన్ని పరాజయాలూ పలకరించాయి. అయితే సదరు చిత్రాలను సైతం రజనీ కోసమే చూసిన వారులేకపోలేదు. అలా ఆ రోజుల్లో తెలుగు చిత్రసీమలోనే కాదు తమిళనాట సైతం రజనీ అందం చిందులు వేసింది. కన్నడ, మళయాళ సీమల్లోనూ ఆ అందం ముచ్చట గొలిపింది.

1990ల ఆరంభం వరకూ బిజీగా సాగిన రజనీ, తరువాత 1998లో ప్రవాసభారతీయుడు డాక్టర్ ప్రవీణ్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. అప్పటి నుంచీ రజనీ సినిమాలకు దూరంగానే ఉన్నారు. తనకు తగ్గ పాత్ర లభిస్తే మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి రజనీ సిద్ధంగా ఉన్నారు. ఆమె తరం తారలు, ఇప్పటి హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ ఉన్నారు. రజనీ కూడా ఏదో ఒకరోజున మళ్ళీ సినిమాల్లో ఆ తీరున సందడి చేస్తుందేమో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం.

Show comments