Site icon NTV Telugu

Striking again: సత్తా చాటుతామంటున్న సీనియర్ డైరెక్టర్స్!

Senior Directors Striking Again

Senior Directors Striking Again

సీనియర్ డైరెక్టర్స్ చాలామంది దుకాణం సర్దేసుకున్నారు. కొందరైతే తమ శిష్యులు తీస్తున్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలేది లేదని భావిస్తున్న కొందరు సీనియర్స్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కథలు తయారు చేసుకుంటూ, తాజాగా మరోసారి తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అలా ఈ యేడాది ముగ్గురు సీనియర్స్ తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారే ఎస్వీ కృష్ణారెడ్డి, శివ నాగేశ్వరరావు, రేలంగి నరసింహారావు! కుటుంబ కథా చిత్రాల దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురు తమ ఖాతాలలో సూపర్ హిట్ చిత్రాలను వేసుకున్న వారే. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా కాస్తంత వెనకబడ్డారు.

తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. సోహెల్, మృణాళిని ర‌వి జంట‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీని కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. మరో సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు ‘మనీ’, ‘మనీ మనీ’ సినిమాలతో తెలుగులో తనదైన ముద్రను చాటుకున్నారు. ఆయన ఇప్పుడు ‘దోచేవారెవరురా’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవచంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇక మూడో దర్శకుడు రేలంగి నరసింహారావు. ఆయన గ్యాప్ తీసుకోకుండా సినిమాలు తీస్తూ ఉంటే ఈ పాటికి గురువు దాసరి బాటలో సెంచరీ కొట్టేసే వారే! అయితే ఆ మధ్య ‘ఎలుక మజాకా’ తీసిన తర్వాత కాస్తంత గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు దానిని పూడ్చుతూ రేలంగి నరసింహారావు ‘ఊ అంటావా ఊహూ అంటావా’ మూవీ తెరకెక్కిస్తున్నారు. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మీద అతి త్వరలోనే ఈ ముగ్గురు సీనియర్ డైరెక్టర్స్ తమ చిత్రాలను జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. మరి ఎలాంటి ఫలితాలు వారికి లభిస్తాయో చూడాలి.

Exit mobile version