జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్ర కథానాయకుడు ఇంద్రసేన పుష్కరకాలంగా నటుడిగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో మంచి సెటప్ కుదిరింది. ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్ అందరికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ ”కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంతో రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్ కథ ఇచ్చారు. నాకోసమే ఈ కథను తయారుచేసిన ఆయనకు నేను జీవితాంతం ఋణపడి వుంటాను. నాకు ఎటువంటి ఇమేజ్ లేకున్నా నాతో ఇంత బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను నా జీవితంలో మరిచిపోలేను. ఈ ‘శాసనసభ’ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది” అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఐశ్వర్యరాజ్ భకుని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, జబర్దస్త్ అప్పారావు, అనీష్ కురువిల్లా, అమిత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సోమవారం జరిగిన మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు చిన్నికృష్ణ, నిర్మాత, ఎమ్ఎల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, జగదీశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, భూషణ్, మహేష్, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.