Sharwanand:టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా శర్వాకు హిట్ పడిందే లేదు. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కోసం బాగా కష్టపడినట్లు కనిపిస్తున్నాడు. కొత్త కథ, కధనంతో ఈసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోయాడు. లేటెస్ట్ గా శర్వా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా ఎస్. ఆర్ ప్రభు నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన శర్వా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.
ఇటీవల ఒక నిర్మాత శర్వానంద్ పై అసత్యప్రచారాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై యంగ్ హీరో నోరువిప్పాడు. ” జాను సినిమా సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. దానివలన బాగా లావు అయ్యాను. ఇక వరుస ప్లాపుల వలన ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. నా ప్లాపులకు వేరే వారిని కారణంగా చూపించను. ఎందుకంటే నన్ను నమ్మే నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తున్నారు. ఇక గతంలో నేనే కథలు వినేవాడిని. ఇప్పుడు నా సన్నిహితులకు కూడా చెప్పి, వారి అభిప్రాయం కూడా తీసుకుంటున్నాను. కొన్నిరోజుల నుంచి ఒక నిర్మాత నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను పారితోషికం తగ్గించుకోనని, నిర్మొహమాటంగా మాట్లాడతానని చెప్పుకొస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఎందుకు తగ్గించుకోవాలి. నా మార్కెట్ ను బట్టి నిర్మాతలు అంతే ఇస్తున్నారు. అందులో ఇంకా తగ్గించుకోవాలని ఎలా చెప్తారు. నా తల్లిదండ్రులు నా విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోరు. మనకు ఆస్తి ఉంది.. నీకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పలేదు.
నీ జీవితం.. నీ కాళ్ళ మీద నువ్వు ఎదగాలి అని చెప్పి పెంచారు. అందుకే 19 ఏళ్ళ వయసు నుంచి నేను కష్టపడుతున్నాను. ఇప్పటివరకు వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. నాపై తప్పుడు ప్రచారం చేసిన నిర్మాత నన్ను మోసం చేశాడు. అతడు నాకు డబ్బు ఇవ్వకపోయినా ఆ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా వలన ఆయనకు ఎంత లాభం వచ్చిందో నాకు తెలుసు. నన్ను మోసం చేస్తే నేను సహించలేను.. నాకు తిక్కరేగిందంటే ఎవరిని లెక్కచేయను. నాకు ఉన్న మార్కెట్ ను బట్టే నేను పారితోషికం తీసుకుంటున్నాను. అలాగని డబ్బు కోసమే పనిచేస్తున్నాని చెప్పను. నా దగ్గర డబ్బు ఉంది.. నేనే స్వంతంగా సినిమాలను నిర్మించుకోగలను. కానీ ఇలా మాట్లాడితే అహంభావంతో మాట్లాడినట్లు ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శర్వా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ నిర్మాత ఎవరు అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.