Site icon NTV Telugu

‘సర్కారు వారి పాట’ సందడి!

నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు.

‘సర్కార్ వారి పాట’ బ్లాస్టర్ ఓపెనింగ్ లోనే “ఇందు మూలంగా యావన్మంది జనానికి తెలియజేయడమేమనగా…” అంటూ పాత పంథాలో ఊళ్ళలో సర్కారు వారి పాట పాడే రీతిన టేకాఫ్ తీసుకోవడం దర్శకుడు పరశురామ్ క్రియేటివిటీని చాటి చెప్పింది. ఇక బ్లాస్టర్ లో హీరో కారు దిగి, “ఇఫ్ ఏ టైగర్ డేట్స్ ఏ ర్యాబిట్… హౌ ఇట్ విల్ బి?” అనే డైలాగ్ అభిమానులను ఇట్టే పట్టేసింది. అవే మాటలను సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటూ మహేశ్ ఫ్యాన్స్ పరవశించిపోతున్నారు. అదే సీన్ లో ఒకణ్ణి చితక్కొట్టాక “సేమ్… ఇఫ్ యు మిస్ ఇంట్రెస్ట్… యు విల్ గెట్ యువర్ డేట్…” అనే పదాలు సైతం ఉరకలు వేయిస్తున్నాయి. అంతేనా… అంటే ఇంకా చాలా ఉంది… “పడుకొనే ముందు ప్రతిరోజూ… దిష్టి తీయడం మరచిపోకండి…” ఈ పదాలు హీరోయిన్ కీర్తి సురేశ్ పెదాలు దాటకుండానే వినిపిస్తాయి. అమ్మాయి జడలోని పూలను చూసి, “ఏమోయ్ కిశోర్… ఓ ఐదారు మూరలు ఉండవవీ…”అంటూ మహేశ్ పలికిన మాటలు సైతం మజా చేస్తున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకంగా జనవరి 13న ‘సర్కారు వారి పాట’ జనం ముందు నిలుస్తుందనీ ఈ బ్లాస్టర్ లో బల్లగుద్ది మరీ చెప్పారు. ఇన్ని ముచ్చట్లతో నిండిన బ్లాస్టర్ భలేగా సందడి చేస్తోంది.

“శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు” చిత్రాలను బాగా గమనిస్తే మహేశ్ బాబు “జనం కోసమే మనం…” అన్న తీరున సాగుతున్నట్టు ఇట్టే కనిపిస్తుంది. అదే తీరున ఆయన తండ్రి కృష్ణ సైతం నటించేసి రాజకీయాల్లో అడుగుపెట్టి అప్పట్లో ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. మరి మహేశ్ బాబు మనసులో ఏముందో కానీ, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అంటూ ‘ప్రభుత్వం’నే టైటిల్ లో తగిలించుకున్నారు. మరి ఇందులో ఏమైనా పొలిటికల్ పంచెస్ ఉంటాయేమో చూడాలి. ‘సర్కారు వారి పాట’ టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు బ్లాస్టర్ చూశాక, ఆ ఆసక్తి మరింత పెరుగుతోంది. మరి మహేశ్ బాబుతో దర్శకుడు పరశురామ్ ‘సర్కారు వారి పాట’ను ఎలా పాడిస్తారో చూద్దాం.

https://youtu.be/2cVu7KZxW3c
Exit mobile version