Sankranti War: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సీనియర్ స్టార్ హీరోలు అంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. బాలకృష్ణ ఈ ఏడాదితో తన కెరీర్‌ను 50వ సంవత్సరంలోకి నెట్టేశారు. చిరంజీవి నటునిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల మొత్తం కెరీర్ ను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో చిరంజీవి కంటే బాలకృష్ణ దాదాపు ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అయితే నటునిగా చిరంజీవి కంటే నాలుగేళ్ళు బాలయ్యనే సీనియర్.
బాలకృష్ణ తన నటజీవితంలో ఇప్పటి దాకా 19 చిత్రాలతో సంక్రాంతి సందడిలో పాలుపంచుకున్నారు. ఈ సారి బాలకృష్ణ 20వ సంక్రాంతి చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. పొంగల్ బరిలో దూకిన బాలకృష్ణ తొలి చిత్రం ‘వేములవాడ భీమకవి’. 1976లో విడుదలైన ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోల్ పోషించారు. ఇందులో నటరత్న ఎన్టీఆర్ కీ రోల్‌లో కనిపించారు. ఆ తరువాత 1977లో తండ్రితో కలసి ‘దానవీరశూర కర్ణ’లోనూ, ఆ పైన 1982లో ‘అనురాగదేవత’లోనూ సంక్రాంతి సంబరాల్లోనే పాలుపంచుకున్నా, ఆ చిత్రాలలో ఆయన హీరో కాదు. 1987లో ‘భార్గవరాముడు’తోనే బాలయ్య అసలైన పొంగల్ హంగామా మొదలయింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా 16 సార్లు బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన కెరీర్‌లో మొత్తం 16 సార్లు పొంగల్ హంగామాలో పాల్గొన్నారు. చిరంజీవి 17వ పొంగల్ మూవీగా ‘వాల్తేరు వీరయ్య’ రానుంది. చిరంజీవి తొలి పొంగల్ సినిమా 1979లో ‘తాయారమ్మ-బంగారయ్య’. ఇందులో చాలా చిన్న పాత్రలో ఆయన కనిపించారు. ఆ తరువాత 1981లో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’లోనూ ఆయన గెస్ట్ గానే చేశారు. ఆయన హీరో అయిన తరువాత 1983లో ‘ప్రేమపిచ్చోళ్ళు’తో సంక్రాంతి సందడిలో పాలుపంచుకోవడం మొదలెట్టారు. అలా ఇప్పటి దాకా 14 పర్యాయాలు చిరంజీవి సినిమాలు పొంగల్ బరిలోకి దూకాయి.
Read Also: Special Report on Waltair Veeraiah Pre Release Event Live: అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర?
బాలకృష్ణ హీరోగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న 16 చిత్రాలలో 4 సినిమాలు (భార్గవరాముడు, ఇన్ స్పెక్టర్ ప్రతాప్, పరమవీర చక్ర, ఎన్టీఆర్-కథానాయకుడు) మినహాయిస్తే, మిగిలిన 12 చిత్రాలు డైరెక్ట్ గా సెంచరీ చూసినవే. చిరంజీవి 14 పొంగల్ సినిమాల్లో నాలుగు తప్పిస్తే (ప్రేమ పిచ్చోళ్ళు, చట్టంతో పోరాటం, కిరాతకుడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్) మిగిలిన 10 సినిమాలు నేరుగా శతదినోత్సవం చూశాయి.
జనవరి 12వ తేదీన బాలకృష్ణ సినిమా పొంగల్‌కు విడుదల కావడం ఇది ఐదో సారి. గతంలో ఆయన నటించిన ప్రాణానికి ప్రాణం (1990), పరమవీరచక్ర (2011), గౌతమీపుత్ర శాతకర్ణి (2017), జై సింహా (2018) చిత్రాలు జనవరి 12వ తేదీనే వెలుగు చూశాయి. మొదటి రెండు సినిమాలు పరాజయం పాలు కాగా, తరువాతి రెండు సినిమాలు జనాన్ని అలరించాయి. అందువల్ల ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదలవుతోంటే బాలయ్య అభిమానుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. అలాగే జనవరి 13వ తేదీన విడుదలవుతున్న చిరంజీవి తొలి చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’నే నిలుస్తుంది. ’13’ అంకె తమ హీరోకు అచ్చివస్తుందో రాదో అని చిరు అభిమానుల్లోనూ కంగారు లేకపోలేదు. ఇక సంవత్సరం సంఖ్యలో చివరన ‘3’ అంకె ఉన్న సమయాల్లో ఎప్పుడూ బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. ఇదే మొదటి సారి 2023లో బాలయ్య పొంగల్ మూవీగా ‘వీరసింహారెడ్డి’ వస్తోంది. ఆ తీరున కూడా కొందరు ఫ్యాన్స్ లో తికమక ఉంది. మరి బాలయ్య, చిరు ఫ్యాన్స్ ఆందోళనను చెరిపేసి ఆ రెండు సినిమాలు 1997 నాటి పొంగల్ హంగామాలో ‘హిట్లర్, పెద్దన్నయ్య’ లాగా ఘనవిజయం సాధిస్తాయేమో చూడాలి.
