Sankranthi Movies: ఏ సంక్రాంతికి అయినా మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతి వేరు.. లెక్క మారింది. నాలుగు సినిమాలు.. ఈ రేసులో పోటీపడుతున్నాయి. థియేటర్స్ ఉంటే.. ఇంకో సినిమా కూడా యాడ్ అయ్యేది. కానీ, చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడంతో ఎట్టేకలకు నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామీ రంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్. గుంటూరు కారం, హనుమాన్ జనవరి 12 న రిలీజ్ అవుతుండగా.. సైంధవ్ జనవరి 13 న, నా సామీ రంగ జనవరి 14 న రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు సినిమాల మీద ప్రేక్షకులు అంచనాలను బాగానే పెట్టుకున్నారు. ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే జరుగుతున్నాయి. ఇక నాలుగు సినిమాల ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక వాటి మీద హైప్ మరింత పెరిగాయి. నాలుగు సినిమాలు నాలుగు జోనర్స్. గుంటూరు కారం పక్కా మాస్ సినిమా. సైంధవ్.. యాక్షన్ అండ్ కూతురు సెంటిమెంట్. ఇక హనుమాన్.. సూపర్ హీరో సినిమా.. చెప్పాలంటే భక్తి సినిమా. నా సామీ రంగ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అంతేకాకుండా రీమేక్. ఈ నాలుగు ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే..
గుంటూరు కారం
మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదటి నుంచి కూడా ఈ కాంబోపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ట్రైలర్ లో మహేష్ మాస్ లుక్ వేరే లెవెల్. త్రివిక్రమ్ డైలాగ్స్, మాస్ పంచ్ లు అదిరిపోయాయి. రమణ.. రమ్యకృష్ణ పెద్ద కొడుకు. కొన్ని కారణాల వలన అతడిని ఇంట్లో నుంచి పంపించేస్తారు. బయట పెరిగిన రమణ.. కొన్నేళ్ల తరువాత తల్లి దగ్గరకు ఎందుకు వచ్చాడు.. తల్లి, రమణను ఎందుకు దూరం పెట్టింది.. ? అనేది కథ. తల్లీకొడుకుల సెంటిమెంట్ ఉన్నా కూడా పూర్తిగా త్రివిక్రమ్ మహేష్ మీదనే ఫోకస్ చేశాడు. మహేష్ వన్ మ్యాన్ షోగా ట్రైలర్ ను కట్ చేశాడు. ఇక థమన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు పెరిగాయనే చెప్పాలి.
సైంధవ్
విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా సైంధవ్ వస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంటా స్టార్ క్యాస్టింగ్ ఉందనే చెప్పాలి. శ్రద్దా శ్రీనాథ్, రుహని శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ.. ఇలా ఒకరిని మించిన ఒకరు ఈ సినిమాలో ఉండడంతో.. మరింత హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. సైంధవ్.. తన కూతురితో కలిసి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే కూతురు ఒకసారి హఠాత్తుగా పడిపోవడంతో డాక్టర్స్ ఆమెకు ఒక అరుదైన జబ్బు ఉందని, దానికోసం రూ. 17 కోట్ల ఇంజెక్షన్ తీసుకురావాలని చెప్తారు. కూతురు కోసం సైంధవ్ ఆ ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక అలా వెళ్లిన సైంధవ్ కు తన గతం తాలూకు గొడవలు ఎదురవుతాయి. సైంధవ్.. సైకోగా మారతాడు.. అసలు ఈ సైకో ఎవరు.. ? ఎందుకు అతడిని చూసి మాఫియా మొత్తం భయపడుతుంది. సైంధవ్ చివరకు తన కూతురును కాపాడుకున్నాడా.. ? అనేది కథ. వెంకటేష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హనుమాన్
తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్. హనుమంతుడి మీద భక్తి లేని వారంటూ ఉండరు. ఆయన గురించి ఎలాంటి సినిమా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు థియేటర్ కు అడుగులు వేస్తారు. ఇక టీజర్ తోనే ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ విజువల్స్ తో ఒక్కసారిగా హైప్ తెచ్చాడు. ట్రైలర్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి పాజిటివ్ వైబ్స్ తోనే ఉన్నారు. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తున్నారు.
నా సామీ రంగ
అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాధ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం నా సామీ రంగ. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అన్ని సినిమాల కన్నా లేట్ గా వచ్చిన సినిమా ఇది. అయినా కూడా నాగ్.. తన నటనతో అభిమానులను తనవైపు తిప్పేసుకున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ .. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపించింది. ఈ కథ అంతా కిష్టయ్య మీదనే తిరుగుతుంది. అతనికి ఇద్దరు స్నేహితులు. వారికి పెళ్లిళ్లు చేసి.. సొంత అన్నలా చూసుకుంటాడు. కానీ , తాను మాత్రం ఒంటరిగా ఉంటాడు. ఇక జాతరలో ప్రభల దగ్గర జరిగిన గొడవ రెండు ఊర్లను విడదీస్తుంది. వేరే ఊర్లో ఉన్న విలన్స్ .. కిష్టయ్యను చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు.మరి కిష్టయ్య తనను తాను కాపాడుకొని జాతర జరిపించాడా.. ? తానెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది.
ఈ నాలుగు సినిమా ట్రైలర్లు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. నాలుగు విభిన్నమైన కథలు.. నలుగురు హీరోలు.. ఎన్నో అంచనాలు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది సంక్రాంతికిహిట్ అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
