యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సమ్మతమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మి.. వాళ్ళు లేని ఇల్లు ఇలానే ఉంటుంది’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది.
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న కృష్ణ తన ఇంటికి ఒక తల్లిలాంటి భార్యను తీసుకురావాలని ఆరాటపడుతుంటాడు. అతనికి ప్రేమ మీద అభిప్రాయం లేకపోయినా పెళ్లి మాత్రం మంచి అమ్మాయిని చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి సమయంలో సత్య ను చూడడం.. తొలి చూపులోనే ఆమెను ఇష్టపడటం జరిగిపోతాయి.. ఆమె ప్రేమలో మునిగి తేలి పెళ్లి చేసుకోవాలి అనే సమయంలో కొన్ని ఒడిదుడుకులు రావడం, సత్య, కృష్ణను వదిలి వెళ్లిపోవడం జరుగుతుంది. తనకు కాబోయే భార్య తనకు నచ్చినట్లుగా ఉండాలని.. తన మాట వినాలని కోరుకొనే కృష్ణకు.. స్వతంత్ర భావాలు కలిగిన సత్యకు మధ్య జరిగే కథనే ‘సమ్మతమే’.
మరి చివరకు కృష్ణ , సత్య కోసం మారాడా..? సత్య, కృష్ణకు సమ్మతం తెలిపిందా ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చివర్లో ‘నీకు నేనే కాదు.. ఏ అమ్మాయి కూడా కరెక్ట్ కాదు.. అద్దంలో నీ మొహం చూసుకొని బొట్టు పెట్టుకొని తాళి కట్టుకో’ అన్న డైలాగ్ ఆకట్టుకొంటుంది. కృష్ణ గ కిరణ్, సత్యగా చాందినీ నటన ఆకట్టుకుంటుంది. శేఖర్ చంద్ర సంగీతం ప్లజెంట్ గా ఉంది.. ఇకపోతే ఈ సినిమా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.