Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన దగ్గరనుంచి కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఆమె విభిన్నమైన పాత్రలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ 2 లో అమ్మడు చేసిన యాక్షన్ సీన్స్ కు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సీరీస్ సామ్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో సామ్ పేరు మారుమ్రోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా సమంత మరో సంచలన నిర్ణయం తీసుకున్నదట.
ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్, డీకే దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన సమంత ప్రస్తుతం ఈ సిరీస్ కోసం కష్టపడుతున్నదట. ఇందులో యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ మ్యాన్ కు మించి ఉండబోతున్నాయని టాక్. ఇందుకోసం ఆమె విల్లు విద్యను కూడా అభ్యసిస్తుందని టాక్. ఇక ఈ సినిమా హాలీవుడ్ మూవీ సిట్టాల్ కు రీమేక్ గా తెరకెక్కుతోందని సమాచారం. సిట్టాల్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించి మెప్పించింది. ఇక ఇప్పటికే మొదలైన ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద, శాకుంతులం విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఫ్యామిలీ మ్యాన్ తో సంచలనం సృష్టించిన సామ్.. ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.