NTV Telugu Site icon

సమంత విలనిజం..

samantha

samantha

దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది. విడాకుల తరువాత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము రేపిన సమంత తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంది. ప్రస్తుతం తమిళంలో సమంత నటిస్తున్న ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోందట. ఇది నయనతార సొంత సినిమా కావటం విశేషం. దీనికి నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకుడు.

విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న ఈ సినిమాలో వారికి సమానమైన పాత్రలో సమంత కనిపించనుంది. ఈ తరహాలో విలనిజం ఉన్న పాత్రను సమంత ఇప్పటి వరకూ సినిమాలలో చేయలేదు. ఈ సినమా కథ అనూహ్యంగా ఆసక్తికరమైన మలుపులు తిరగడానికి సమంత పాత్ర కారణమవుతుందట. ‘ఫ్యామిలీమ్యాన్’ లో ఈ తరహా పాత్రను పోషించి ఆకట్టుకున్న సమంతకు ఇది నల్లేరుబండి మీద నడకే అంటున్నారు. ప్రస్తుతం సమంత నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక థ్రిల్లర్ జోనర్లో నిర్మితమవుతున్న ‘యశోద’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటోంది సమంత.
నిజానికి ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాను నయనతార, త్రిషతో తెరకెక్కించాలనుకున్నాడు విఘ్నేష్. అయితే త్రిష తప్పుకోవడంతో అవకాశం సమంత తలుపు తట్టింది.

‘సూపర్ డీలక్స్’ తర్వాత నయనతార, సమంత కలసి నటిస్తున్న సినిమా ఇది. అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ కళ ఈ సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చెన్నై, పాండిచ్చేరి, మైసూర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. మరి రెండోసారి విలనీ ప్రదర్శించబోతున్న సమంత తన నటనతో ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.