Salman Khan: కండలవీరుడు సల్మాన్ ఖాన్ కుటుంబం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సూత్రాన్ని పాటించే అసలు సిసలు భారతీయతకు నిదర్శనం అంటారు ఆయన సన్నిహితులు. ఎందుకంటే సల్మాన్ ఇంట్లో అన్ని మతాల పర్వదినాలనూ ఘనంగా నిర్వహిస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్న సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోవడానికి ఆరేళ్ళుగా శ్రమిస్తూనే ఉన్నారు. రాబోయే సంవత్సరం ఏప్రిల్ 21న సల్మాన్ హీరోగా రూపొందిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ విడుదల కానుంది. ఇందులో తెలుగు స్టార్ హీరో వెంకటేశ్ సైతం ఓ కీలక పాత్ర ధరించారు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవితో కలసి ‘గాడ్ ఫాదర్’లో కనిపించారు సల్మాన్. అలా తెలుగు చిత్రసీమతోనూ అనుబంధం పెంచుకున్న సల్మాన్ ఈ సారి ఎలాంటి సక్సెస్ చూస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారతదేశంలో తరిగిపోని చెరిగిపోని రికార్డులు సొంతం చేసుకున్న ‘షోలే’ చిత్ర రచయితలు సలీమ్-జావేద్ ద్వయంలో సలీమ్ ఖాన్ పెద్దకొడుకు సల్మాన్. 1965 డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ జన్మించారు. భారతదేశంలో ఎందరో పేరున్న రచయితల తనయులు తెరపైన వెలిగారు. అయితే సలీమ్ తనయుడు సల్మాన్ ఖాన్ స్థాయిలో వెండితెరపై వెలిగిపోయిన వారు లేరనే చెప్పాలి. బాల్యంలో తండ్రి సక్రమంగా ఇంటిపట్టున లేకపోవడంతో పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు తానే నిర్వర్తించేవారు సల్మాన్. ఎలాగైనా సినిమాల్లో నటించాలనే తపనతో కొన్ని సినిమాల్లో అలా వచ్చి, ఇలా పోయే పాత్రల్లో కనిపించారు. ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించారు. ఆ సమయంలోనే అతని శరీరసౌష్టవం చూసిన రాజశ్రీ సంస్థ అధినేతలు తాము నిర్మించబోయే ‘మైనే ప్యార్ కియా’లో ప్రేమ్ పాత్రకు సల్మాన్ ను ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలచింది. తెలుగులోనూ ‘ప్రేమపావురాలు’ పేరుతో అనువాదమై అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత సల్మాన్ బాలీవుడ్ యంగ్ హీరోస్ లో స్టార్ గా నిలిచారు. హీరోగా నటించిన రెండో సినిమా ‘బాఘీ’తోనే కథకుడు అనిపించుకున్నారు సల్మాన్. అయితే అది పరాజయం పాలయింది. ‘సాజన్’లో సంజయ్ దత్ తో కలసి నటించీ మెప్పించారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’లో మరోమారు ప్రేమ్ గా కనిపించారు. మాధురీ దీక్షిత్ తో సల్మాన్ జోడీ కట్టిన ఆ సినిమా కనకవర్షం కురిపించింది. ఈ సినిమా కూడా తెలుగులో ‘ప్రేమాలయం’గా అనువాదమై మరోమారు అనూహ్య విజయాన్ని సల్మాన్ కు అందించింది. దాంతో సల్మాన్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. ఆ పై స్టార్ హీరోగా జేజేలు అందుకుంటూ సాగిన సల్మాన్ పరాజయాల పర్వంలో పయనిస్తూ ఉండగా, సౌత్ రీమేక్స్ అతణ్ని కాపాడాయి. మళ్ళీ తన స్టార్ హోదాను నిలుపుకోవడానికి దక్షిణాది చిత్రాల కథలే సల్మాన్ కు ఊపిరి పోశాయి.
రీల్ లైఫ్ లో తిరుగులేని మాస్ హీరోగా సాగుతున్న సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ లో పలు ప్రేమాయణాలు సాగించారు. ఇప్పటికీ అవివాహితుడిగానే ఉన్నారు. ప్రతియేటా ఈద్ కానుకగా సినిమాలను విడుదల చేసే సల్మాన్ తన ‘రాధే’ చిత్రాన్ని జీ 5 ఓటీటీలో నేరుగా విడుదల చేశారు. అయితే మునుపటిలా ఆకట్టుకోలేక పోయారు. తరువాత వచ్చిన సల్మాన్ ‘అంతిమ్’ కూడా మురిపించలేకపోయింది. ఈ యేడాది చిరంజీవితో కలసి ‘గాడ్ ఫాదర్’లో నటించారు సల్మాన్. డిసెంబర్ లో వస్తోన్న ‘వేడ్’లో కూడా కేమియో రోల్ లోనే కనిపించనున్నారు సల్మాన్. అందువల్ల రాబోయే సల్మాన్ మూవీస్ పైనే అభిమానులు ఆశలు పెంచుకున్నారు. ‘పఠాన్’ సినిమాలో కేమియో అప్పియరెన్స్ ఇస్తున్నారు సల్మాన్. “ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై” చిత్రాల్లో ‘టైగర్’గా అలరించిన సల్మాన్ ఇప్పుడు ‘టైగర్ 3’లో నటిస్తున్నారు. దీనికంటే ముందుగా సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా సల్మాన్ ఆశించే ఘనవిజయం ఆయన సొంతమవుతుందేమో చూడాలి.