‘శ్యామ్ సింగ రాయ్’ టీం ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎక్కడ చూసినా ‘శ్యామ్ సింగ రాయ్’ సందడే కన్పిస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’టీంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగింది ఓ యాంకర్. వెంటనే సాయి పల్లవి అందుకుని స్మైల్ ఇస్తూనే ఆమె ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఒక ప్రముఖ తెలుగు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి వైరల్ అవుతున్న క్లిప్‌లో నాని, కృతి శెట్టి మధ్య కిస్ సీన్స్ ఉండడం సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ “ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు ?” అని అడిగేసింది. సాయి పల్లవి జోక్యం చేసుకుని “అలాంటి ప్రశ్న అడగడమే అసౌకర్యం” అని కౌంటర్ వేసింది. “నేను ఈ ప్రశ్న చాలా అసౌకర్యంగా భావిస్తున్నాను. సీన్‌ని డిస్కస్ చేసి, ఒకరికొకరు కంఫర్ట్ అయ్యి, కథ కోసమే చేశారట. సహజంగానే మీరు దాని గురించి వారిని అడిగినప్పుడే వారు అసౌకర్యానికి గురవుతారు” అంటూ సాయి పల్లవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. సినిమాలో ఒకే ఒక్క రొమాంటిక్ సీన్ ఉందా ? అని ఆమె మరో ప్రశ్న అడగ్గా… “మీరు మళ్ళీ అదే ప్రశ్న అడగడం అన్యాయం” అంటూ నవ్వేసింది.
నాని మాట్లాడుతూ “కథ కోసం మనం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే మాకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. ప్రొఫెషనల్ నటులుగా మేము సన్నివేశాలతో బెస్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేశాము” అంటూ చెప్పుకొచ్చాడు. శ్యామ్ సింగ రాయ్ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుండగా, ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించనుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ‘శ్యామ్ సింగ రాయ్’లో నాని ద్విపాత్రాభినయం చేసారు. 1950లలో బెంగాల్ ఆధారిత కాల్పనిక పాత్ర ‘శ్యామ్ సింగ రాయ్’.