NTV Telugu Site icon

Russell Crowe: రస్సెల్ క్రోవ్ అసూయకు కారణమేంటి!?

Gladiator

Gladiator

Russell Crowe:న్యూజీలాండ్ యాక్టర్, హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆస్కార్ విజేత రస్సెల్ క్రోవ్ కు ఓ విషయంలో తెగ అసూయ కలుగుతోందట! సరిగా 23 ఏళ్ళ క్రితం అంటే 2000లో రస్సెల్ క్రోవ్ హీరోగా రూపొందిన ‘గ్లాడియేటర్’ సినిమా విడుదలై, విజయఢంకా మోగించింది. భారతదేశంలోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులనూ సొంతం చేసుకుంది. అందులో రస్సెల్ క్రోవ్ కూడా ఉత్తమనటునిగా ఆస్కార్ అందుకున్నారు. తనకు హాలీవుడ్ లో అసలైన గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం ‘గ్లాడియేటర్’యేనని, ఆ సినిమా లేకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో అంటున్నారు రస్సెల్. తనను నటునిగా ఎక్కడో కూర్చోబెట్టిన ‘గ్లాడియేటర్’ సీక్వెల్ లో తాను లేకపోవడం కాసింత బాధ కలిగిస్తోందని, అలాగే అసూయ కూడా ఉందని రస్సెల్ నిజాయితీగా చెబుతున్నారు.

Halle Berry: కాక రేపుతున్న హాలీ బెర్రీ సెల్ఫ్ లవ్!

‘గ్లాడియేటర్’ సినిమాకు ఇరవై మూడేళ్ళ తరువాత సీక్వెల్ తీయడమే విడ్డూరమని, అది అప్పుడే తెరకెక్కించి ఉంటే తప్పకుండా తాను తప్ప వేరే ఛాయిస్ ఉండేది కాదని అంటున్నారు రస్సెల్. కానీ, ఇప్పటికీ తనకు ‘గ్లాడియేటర్’ నాటి బలముందని చెబుతున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ‘గ్లాడియేటర్’లో మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ అనే యోధుని పాత్రను పోషించారు రస్సెల్. ఆ పాత్రలో రస్సెల్ నటించలేదు, జీవించారని జనం అన్నారు. ఆస్కార్ సైతం రస్సెల్ ను ఉత్తమ నటునిగా వరించింది. ఇంత చరిత్ర ఉన్న ఈ సినిమా సీక్వెల్ లో కనీసం ఓ చిన్న పాత్ర ఇచ్చినా, తాను ఎంతో సంతోషంగా నటించేవాడినని అంటున్నారు రస్సెల్. ఈ సినిమా షూటింగ్ మొదలయింది. 2024 నవంబర్ లో ‘గ్లాడియేటర్-2’ రానుంది. ఈ లోగా దర్శకుడు రిడ్లే స్కాట్ మనసులో ఆలోచన కలిగి, రస్సెల్ ను సీక్వెల్ లో ఏదైనా పాత్రలో నటింపచేస్తారేమో చూడాలి.