టాలీవుడ్ లో గత కొన్ని నెలల నుంచి టికెట్ రేట్ల విషయమై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లను పెంచమంటూ సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం అలాగే నానుతోంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే గనుక టాలీవుడ్ కు భారీ నష్టం తప్పదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో దేశం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలతో పాటు టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు సైతం విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” కూడా ఒకటి. అయితే ఇప్పట్లో ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం తేలేలా కన్పించడం లేదు. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ విషయమై కోర్టుకు వెళ్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ స్పందించారు.
Read Also : “పుష్ప” నుంచి అదిరిపోయే అప్డేట్
“టిక్కెట్టు ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిజం. మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. మేము గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని సంప్రదించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం మా పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాము’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
