ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కాబోతోంది. దీంతో అంతకు ముందు సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించిన సినిమాలు వెనక్కి జరుగుతాయని భావించారు. అలా కొన్ని విడుదలలు మార్చుకున్నా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఓవారం తర్వాత సరిగ్గా సంక్రాంతి రోజు అయిన జనవరి 14ననే వస్తుందని ప్రకటించారు నిర్మాతలు. ఇక జనవరి 12న రాబోతున్నట్లు చెప్పిన ‘భీమ్లా నాయక్’ కూడా అదే తేదీన వస్తానంటున్నాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలసి సంక్రాంతి రేసు నుంచి తప్పుకోమని అభ్యర్దిస్తారని గత కొంత కాలంగా మీడియా చెబుతూ వస్తోంది.
Read Also : “అడవి తల్లి మాట”… ‘భీమ్లా నాయక్’ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్
అయితే అలాంటి సమావేశం ఏదీ జరగకపోవడంతో ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు జనవరి 12న విడుదల చేయాలనే ఒరిజినల్ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నారు. శనివారం సినిమాలో నాల్గవ పాట విడుదల చేశారు. అందులోనూ సంక్రాంతికే వస్తున్నట్లు ప్రకటించారు. సో ఐదు రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ వస్తున్నా… తమ సినిమా తర్వాత రెండు రోజులకు ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతున్నా వెనుకాడేది లేదంటున్నాడు ‘భీమ్లానాయక్’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ సినిమా కావటంతో టిక్కెట్ ధరల విషయంలో నిక్కచ్చిగ్గా వ్యవహరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. నిజానికి ఇటీవల విడుదలైన ‘అఖండ’ బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించిన ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అదే సూత్రాన్ని అమలు చేయవచ్చని భావిస్తున్నారు. సో సందట్లో సడేమియా అన్నట్లు తన సినిమా కూడా అదే సమయంలో వస్తే లాభం ఉంటుందని, ఒక వేళ తర్వాత తేదీల్లో వస్తే అలాంటి వెసులుబాటు ఉండదనే భావన ‘భీమ్లా నాయక్’ యూనిట్ లో ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన మీదట చిత్ర నిర్మాతలు ఇప్పుడు విడుదల తేదీని మార్చడానికి అంతగా ఇష్టపడటం లేదట. ప్లాన్ చేసిన విధంగానే భారీ ప్రమోషన్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
Read Also : సెలెబ్రెటీలకు షరతులు… కత్రినా, విక్కీ పెళ్ళిలో కఠిన రూల్స్
మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సమకూర్చి డైలాగ్స్ రాశారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ అనుకున్న డేట్ కే వచ్చి సందడి చేస్తుందా? లేక ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో వెనక్కి వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అంటే భయం లేదన్నట్లు ముందుకు దూసుకు వస్తున్నాడు ‘భీమ్లా నాయక్’. ఏం జరుగుతుందన్నది వెయిట్ అండ్ సీ.