Site icon NTV Telugu

RRR: అప్పుడే ఓటిటీలోకి ‘ఆర్ఆర్ఆర్’.. ఎందులో చూడొచ్చంటే..?

RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక రికార్డుల విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జక్కన్న సినిమా అంటే రికార్డుల చరిత్రను ఆయనకు ఆయనే తిరగరాయాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించి మెప్పించారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో రిలీజ్ అవుతుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పుడిప్పుడే రాదు అనుకున్నారు. కానీ, ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నెలరోజుల్లోనే ఓటిటీలో అడుగుపెట్టనున్నదట. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. కేవలం హిందీ మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదట. నెలరోజులు అనగా ఏప్రిల్ చివరి వారం లో ఈ సినిమా ఓటిటీ లో స్ట్రీమింగ్ కానున్నదని సమాచారం.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సినీ అభిమానులు ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version