one more Song Released by Movie Unit of Most Awaited RRR Movie.
సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని కళ్ళింతలు చేసుకొని ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీలోని మరో పాట జనం ముందు నిలచింది. “నెత్తురు మరిగితే ఎత్తర జెండా…” అంటూ సాగే ఈ పాట ప్రోమో విడుదలయితేనే అభిమానులు పదే పదే విని ఆనందించారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ‘ఎత్తర జెండా…’ పూర్తి పాట మార్చి 14న విడుదలయింది. ఇలా వచ్చీ రాగానే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఫ్యాన్స్ అదే పనిగా చూడడం మొదలెట్టారు. ఇంకేముంది వ్యూస్ సర్రున ఆకాశం వైపు పరుగు తీస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో జూ. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’ లోని కొన్ని పాటలు ఇప్పటికే జనం నోళ్ళలో నానుతున్నాయి. ఇప్పుడు విడుదలైన “ఎత్తర జెండా…” పాట వాటన్నిటినీ అధిగమిస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో జూ. యన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కనిపిస్తోన్న గెటప్స్ ఫ్యాన్స్ ను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. “నెత్తురు మరిగితే… ఎత్తరా జెండా… సత్తువ ఉరిమితే…కొట్టర కొండా…” అంటూ మొదలవుతుందీ గీతం. కీరవాణి బాణీలకు తగ్గ రీతిలో రామజోగయ్య శాస్త్రి ఈ పాటను పలికించారు. ఇదే పాటలో హీరోయిన్ అలియా భట్ సైతం తన అందచందాలతో కనువిందు చేసింది. పాటకోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్టింగ్ సైతం కనులకు ఆనందం పంచుతుంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కాన్సెప్ట్ రూపొందించగా, హరీశ్ కొరియోగ్రఫీ నిర్వహించారు. విశాల్ మిశ్రా, పృథ్వీచంద్ర, ఎమ్.ఎమ్. కీరవాణి, సాహితీ చాగంటి, హారిక నారాయణ్ ఈ గీతాన్ని ఆలపించారు.
ఇద్దరు హీరోలు ఎంతో చలాకీగా వేసిన చిందులు ఇరువురి అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఎవరూ ఎవరికీ తీసిపోనట్టుగా తమ ఎనర్జీ లెవెల్స్ చూపిస్తూ నృత్యం చేశారు. పాటలో వారిద్దరూ కనిపించే గెటప్స్, నేపథ్యంలో దేశభక్తుల చిత్రాలు రావడం కూడా చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయని చెప్పవచ్చు.. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. తొట్టతొలుత స్నేహం పై సాగే గీతం “దోస్తీ…” అంటూ విడుదలయింది. తరువాత కొమురం భీమ్ నేపథ్యంలో సాగే “కొమరం భీముడో…”, అల్లూరి సీతారామరాజు బ్యాక్ డ్రాప్ లో వచ్చే “రామమ్… రాఘవమ్…” పాటలూ అలరించాయి. “జననీ…”అంటూ మొదలయ్యే గీతం మనసులు తడి చేస్తుంది. ఇక మాస్ ను విశేషంగా ఆకట్టుకొనేలా “నాటు… నాటు…” సాంగ్ రూపొందింది. ఈ పాటను ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు. ఇక ఆ ఎన్నికల ఫలితాల వేళలోనూ జూ. యన్టీఆర్, రామ్ చరణ్ ముఖాలను మోడీ, యోగి ఫేసులతో మార్ఫింగ్ చేసి భలేగా జనాన్ని ఆకట్టుకుంది మీడియా. ఆ పాట మాస్ ను ఎంతలా ఉరకలెత్తించిందో, అదే తీరున “నెత్తురు మరిగితే… ఎత్తర జెండా…” పాట సైతం ఆకట్టుకొంటోంది. ఈ ఉత్సాహం మార్చి 25న విడుదలయ్యే ‘ట్రిపుల్ ఆర్’కు మరింత క్రేజ్ పెంచుతోంది.