ఇటీవల టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికలు ఎంతటి వివాదం సృష్టించాయో అందరికి తెలిసిందే. అయితే అంతకు మించి తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. 2019లో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. అప్పట్లో విశాల్ వర్గం అవకతవకలకు పాల్పడిందంటూ ప్రత్యర్ధి వర్గానికి చెందిన భాగ్యరాజ్ తదితరులు కోర్టుకు వెళ్ళడంతో ఫలితాలను నిలిపి వేశాయి. 3 సంవత్సరాల తర్వాత తాజాగా ఆదివారం విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించారు. దాంతో విశాల్ వర్గం గెలుపొందింది. నాజర్ రెండవ సారి అధ్యక్షుడిగా, విశాల్ కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే విశాల్ వర్గానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విశాల్ వర్గాన్ని అభినందించటం విశేషం.
Read Also : Sonam Kapoor : పిక్ తో ప్రెగ్నన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్
ఇదిలా ఉంటే విశాల్ వర్గం అవకతవకలకు పాల్పడిన వ్యవహారం కౌంటింగ్ లో బహిర్గతం అయిందంటూ భాగ్యరాజ్ వర్గం కౌంటింగ్ నుంచి వాకౌట్ చేసింది. అంతే కాదు ప్రతి పోస్టుకు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదు కావటాన్ని ఉదాహరణగా చూపింది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే మొత్తం 1300 పోల్ కాగా… 1450 వరకూ కౌంటింగ్ లో తేలటాన్ని పరాకాష్టగా అభివర్ణించింది. అయితే వారి వాదనను పట్టించుకోకుండా ఫలితాలను ప్రకటించారు. దీనికి రాజకాయాలే కారణమని అరోపిస్తోంది భాగ్యరాజ్ వర్గం. విశాల్ ప్యానెల్ నుంచి పోటీ చేసి పూచి మురుగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్టాలిన్ కి అతి సన్నిహితుడని, నటీనటలులలో అంతగా గుర్తింపు లేని అతగాడికి విశాల్ తో సహా అందరికంటే ఎక్కువ ఓట్లు రావటాన్ని ఎత్తి చూపుతోంది భాగ్యరాజ్ వర్గం. మరి భాగ్యరాజ్ వర్గం గోడును ఎవరు పట్టించుకుంటారు? నిజంగా నడిగర్ సంఘం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా అన్నది తేలాల్సి ఉంది.