తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘షో’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకులు నీలకంఠ. అంతేకాదు… ‘షో’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎంపికైంది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’, ‘విరోధి’ చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. థ్రిల్లర్ జానర్స్ ను తెరకెక్కించడంలో మంచి పేరున్న నీలకంఠ మరోసారి అదే జానర్ లో మూవీ చేస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనక్, అందాల భామ రిచా పనయ్ జంటగా నీలకంఠ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన తొలి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది.
Read Also : గోవా బీచ్ లో “సర్కారు వారి పాట” మాస్ ఫైట్
‘అల్లరి’ నరేశ్ ‘యముడికి మొగుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిచా పనాయ్ మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే నీలకంఠ లాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఓ ఎడ్యుకేషన్ గా భావిస్తున్నానని, ఇందులో తనది ఓ మోడర్న్ గర్ల్ క్యారెక్టర్ అని రిచా పనాయ్ తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విశేషం ఏమంటే… దర్శకుడు నీలకంఠ దీనితో పాటే ప్రథమ భూదాత, పోచంపల్లికి చెందిన స్వర్గీయ వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్ నూ తెరకెక్కించబోతున్నారు. దీనిని రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించబోతున్నారు.