Vaishali Balsara: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. ప్రముఖ సింగర్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గుజరాతీ సింగర్ వైశాలి బల్సారా మృతదేహం ఆదివారం పార్ నది ఒడ్డున లభించింది. ఈ ఘటన ప్రస్తుతం గుజరాతీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుజరాతీ సింగర్ వైశాలి బల్సారా ఫేమస్ సింగర్. ఎన్నో సినిమాలలో ఆమె మంచి పాటలను పాడింది. ఆమె భర్త హితేష్ కూడా సింగరే. కాగా.. శనివారం ఉదయం తన కారులో బయటికి వెళ్లిన వైశాలి వెనక్కి రాలేదు. దీంతో భర్త హితేష్ అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులకు తన భార్య వైశాలి ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తుంటే తీయడం లేదని ఫిర్యాదు చేశాడు.
ఇక హితేష్ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న పోలీసులకు గుజరాత్ లోని పార్ నది ఒడ్డున ఒక కారు చాలా సేపు ఆగి ఉందని స్థానికులు తెలిపారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు కారులో వైశాలి మృతదేహం లభించింది. కారు వెనుక సీటులో ఆమె విగతజీవిగా కనిపించింది. అయితే ఇది హత్య..? ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది. కారు బ్యాక్ సీట్ కు వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరంలేదు.. ఇది ఖచ్చితంగా హత్యనే అని వైశాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.