(ఆగస్టు 5న చక్రపాణి జయంతి)
చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువాదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ‘చందమామ’ ఇంగ్లిష్ ప్రతి కోసం కళ్ళింతలు చేసుకొని బాలలు ఎదురుచూసిన రోజులూ ఉన్నాయి. తమ పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం కలగాలని కోరుకునే కన్నవారు ‘చందమామ’ ఇంగ్లిష్ పత్రిక తెప్పించేవారు. ఇక చిత్రసీమలోనూ చక్రపాణి బాణీ భలేగా సాగింది. ‘చెక్కన్న’గా సినీజనం అభిమానం సంపాదించిన చక్రపాణి మిత్రుడు బి.నాగిరెడ్డితో కలసి ‘విజయా సంస్థ’ను నెలకొల్పి, తెలుగువారు మరచిపోలేని చిత్రాలను అందించారు. ఆ రోజుల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోగా ‘విజయా-వాహినీ స్టూడియోస్’ను తీర్చిదిద్దడంలోనూ చక్రపాణి పాత్ర ఎంతో ఉంది. నిర్మాతగానే కాదు, దర్శకునిగానూ చక్కన్న సాగారు. ఆయన మాట కటువుగా అనిపించినా, మనసు వెన్న అనేవారు చాలామంది. సినిమాలు తీసిన వారు ‘చెక్కన్న’ తీర్పు కోసం ముందుగా ఆయనకు ప్రదర్శించేవారు. సినిమా చూసిన తరువాత చెక్కన్న చేసే కామెంట్ ను బట్టి మార్పులూ చేర్పులూ చేసుకొనేవారు. చెక్కన్న చెప్పిన అభిప్రాయం, కోట్లాది ప్రేక్షకుల తీర్పు ఒకేలా ఉండేవి.
స్వర్ణయుగంలో చక్రపాణి
చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆయనకు ముందు తరువాత కూడా ఎందరో సరస్వతీపుత్రులు, సాహితీప్రియులు తెనాలిలో వెలిశారు. చక్రపాణి అన్నది ఆయన కలం పేరు. చిన్నతనం నుంచీ సాహిత్యం అంటే చెప్పలేనంత అభిమానం. కనిపించిన పుస్తకమల్లా చదివేసేవారు. తాను చదివిన రచనను ఏదో సరదాకు అన్నట్టుగా కాకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదివేవారు. 1932లో చక్రపాణి టీబీ బారిన పడ్డారు. ఆ రోజుల్లో ఆ వ్యాధికి మదనపల్లె శానిటోరియం తగిన చికిత్స అందించేది. అక్కడ చేరిన చక్రపాణికి, అదే వ్యాధితో శానిటోరియం వచ్చిన ఓ బెంగాలీ పరిచయమయ్యారు. ఆయన ద్వారా బెంగాలీ భాష నేర్చుకున్న చక్రపాణి, తరువాతి రోజుల్లో శరత్ బాబు రాసిన బెంగాలీ నవలలు ‘దేవదాసు’, ‘బడీ దీదీ’ తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత మరికొందరు శరత్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినా, చక్రపాణిలాగా పఠితులను ఆకట్టుకోలేక పోయారు. చక్రపాణి కలం నాటకాలూ పలికించింది. పి.పుల్లయ్య ఆహ్వానం మేరకు ఆయన తెరకెక్కించిన ‘ధర్మపత్ని’కి రచన చేశారు చక్రపాణి. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’కు కూడా చక్రపాణి రచయిత. సినిమాలకు రచన చేస్తూ, తన రచనలను పుస్తకాలు వేయిస్తూ ఉండేవారు చక్రపాణి. ఆ క్రమంలో బి.యన్.కె. ప్రెస్ నిర్వహిస్తున్న బి.యన్. రెడ్డి తమ్ముడు బి.నాగిరెడ్డి పరిచయమయ్యారు. అది కాస్తా గాఢ స్నేహంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులు కలసి ‘విజయా’ సంస్థను నెలకొల్పి, విలువలుగల చిత్రాలను వినోదంతో నింపి మరీ ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంకేముంది విజయావారి చిత్రాలను తెలుగు జనం విశేషంగా ఆదరించారు. అలాగే తెలుగు సినిమా స్వర్ణయుగంలో విజయావారి చిత్రాలే అధికంగా విజయం సాధించాయని చెప్పవచ్చు.
సలహాలూ…సూచనలూ…
జనాన్ని ఆకర్షించడం కోసం వెకిలి వేషాలు, అసభ్య సన్నివేశాలు, అశ్లీలపు చేష్టలు చేయించకుండా ఇంటిల్లి పాది కలసి సినిమాలు చూసేలా చేయాలని చక్రపాణి, నాగిరెడ్డి భావించారు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు చివరి సినిమా ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ దాకా ఆ ఇద్దరు మిత్రులు అదే తీరున సాగారు. తాము నిర్మించే చిత్రాలలోనే కాదు, తమ స్టూడియోలో నిర్మితమయ్యే సినిమాలను చక్రపాణి చూస్తూ ఉండేవారు. అడిగినవారికి తగిన సలహా ఇచ్చేవారు. లేదంటే, తాను గమనించిన పొరబాట్లను చెప్పి అవి మళ్ళీ జరగకుండా చూసుకోమని చెప్పేవారు. ‘అందమైన యన్టీఆర్ ఏడిస్తే జనం చూడరు’ అన్నది చక్రపాణి ప్రగాఢ విశ్వాసం. ఆయన చెప్పినట్టుగానే ‘చిరంజీవులు, టాక్సీరాముడు’ వంటి చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. అయితే ఆయన అభిప్రాయాన్ని తోసిరాజని యన్టీఆర్ ‘రక్తసంబంధం’ విజయం సాధించింది. అలాగే యన్టీఆర్ ను బికారిగా చూపిస్తే జనం మెచ్చరు అని బి.ఏ.సుబ్బారావుకు సలహా ఇచ్చారు. కానీ, ఆయన ముందుకు సాగారు. తత్ఫలితంగా వెలుగు చూసిన ‘రాజు-పేద’ చిత్రం నటునిగా యన్టీఆర్ కు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఇదే బి.ఏ.సుబ్బారావు రూపొందించిన ‘భీష్మ’ విషయంలోనూ చక్రపాణి జోస్యం ఫలించలేదు. యన్టీఆర్ ను ముసలాడిగా చూపిస్తే ఎవరు చూస్తారు అని కామెంట్ చేశారాయన. కానీ, జనం ‘భీష్మ’కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆయన మాట తు.చ. తప్పకుండా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఏయన్నార్ ‘ దేవదాసు’తో భగ్నప్రేమికుడు అనిపించుకోవడంతో తరువాత కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ ఇమేజ్ నుండి బయట పడమని ఏయన్నార్ కు సలహా ఇచ్చారు. అంతేకాదు, తన ‘మిస్సమ్మ’లో ఏయన్నార్ తో హాస్యం పండించారు చెక్కన్న. కృష్ణ తన 100వ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ను సినిమాస్కోప్ లో భారీగా నిర్మించి, చెక్కన్నకు ప్రివ్యూ వేశారు. “ఈ సినిమా చూశాక జనం నీ రెగ్యులర్ మూవీస్ చూడటానికి కనీసం రెండేళ్ళు పడుతుంది” అని చెక్కన్న చెప్పారు. అలాగే కృష్ణకు ఆ తరువాత దాదాపు డజనుకు పైగా చిత్రాలు పరాజయం చవిచూపాయి. ఇలా చెక్కన్న పలువురికి సలహాలూ,సూచనలూ ఇస్తూ చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు.
అచ్చిరాని దర్శకత్వం!
చెక్కన్న తాను నిర్మించే చిత్రాల విషయంలో ప్రతీ అంశంలోనూ జోక్యం చేసుకొనేవారు. అది ఎల్.వి.ప్రసాద్ లాంటివారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. కానీ, కేవీ రెడ్డి మాత్రం ‘పాతాళభైరవి’ సమయంలో చెక్కన్నతో కలసి పనిచేశారు. ఆ తరువాత నుంచీ విజయా సంస్థలో కేవీ రెడ్డి పనిచేసే సమయంలో ముందుగానే ‘చెక్కన్న జోక్యం చేసుకోరాదు’ అని నియమం పెట్టి మరీ చిత్రాలు తీశారు. దాంతో చెక్కన్నకు దర్శకత్వం అన్నది ఏమీ బ్రహ్మపదార్థం కాదు, స్క్రిప్ట్ సరిగా ఉంటే దర్శకుల గొప్పతనం ఏముంది అనేవారు. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని ఆయన సూచనల మేరకే తెరకెక్కించారు. డి.వి.నరసరాజు రచనతో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ తెరకెక్కింది. అదే సమయంలో ఈ చిత్రాన్ని తమిళంలో ‘మనిదన్ మారవిల్లై’ పేరుతో చక్రపాణి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. తెలుగులో ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్ కాగా, తమిళ ‘మనిదన్ మారవిల్లై’ పరాజయం పాలయింది. అప్పటి నుంచీ చక్రపాణి ఎక్కడ తేడా వచ్చిందా అన్న ఆలోచనలో పడ్డారు. పద్నాలుగేళ్ళ తరువాత ‘మిస్సమ్మ’కథను అటుఇటుగా మార్చి, ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందించాలనుకున్నారు. బాపును తన కో-డైరెక్టర్ గా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే చెక్కన్న కన్నుమూశారు. తరువాత బాపు నిర్దేశకత్వంలో ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందింది. ఆ సినిమా ఆట్టే అలరించలేకపోయింది. చెక్కన్న మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. ఏది ఏమైనా చక్రపాణి, నాగిరెడ్డి ఓ ఆత్మ రెండు శరీరాలుగా మసలారు. నాగిరెడ్డితో కలసి చెక్కన్న నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్, డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. వారి తలపులు మాత్రం జనం మదిలో నిలచే ఉన్నాయి.