NTV Telugu Site icon

హాస్యంతో చెలరేగిన రేలంగి నరసింహారావు!

Relangi Narasimha Rao

Relangi Narasimha Rao

తెలుగు చిత్రసీమలో ‘గురువు గారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు పేరే! తరువాత చప్పున ఆయన శిష్యగణం కూడా మన స్మృతిపథంలో మెదలుతారు. వారిలో కోడి రామకృష్ణ ముందుగా కనిపిస్తారు. వెనువెంటనే రేలంగి నరసింహారావు గుర్తుకు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా! అలా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు దాసరి శిష్యులు. రేలంగి నరసింహారావు తెలుగులోనే కాదు కన్నడనాట కూడా తనదైన బాణీ పలికించడం విశేషం. కామెడీతో కబడ్డీ ఆడేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించారు నరసింహారావు. ప్రస్తుతం ఆయన ‘ఊ అంటావా మామా…ఊఊ అంటావా మామా…’ అనే హారర్ కామెడీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

రేలంగి నరసింహారావు 1951 సెప్టెంబర్ 30న పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ కళలంటే ఆసక్తి. ఫోటోగ్రఫి అంటే నరసింహారావుకు ఇష్టం. ఇక చదువుకొనే రోజుల్లో తన క్లాస్ మేట్ కోడి రామకృష్ణతో కలసి పలు నాటకాలు వేశారు. తమ ఊరివారయిన దాసరి నారాయణరావు చిత్రసీమలో ఉండడంతో కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు మనసులు సైతం సినిమా రంగంవైపు ఆకర్షితమయ్యాయి. 1971లో బియస్సీకి స్వస్తి చెప్పి రేలంగి నరసింహారావు మద్రాసు చేరారు. తొలుత దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద అప్రెంటిస్ గా ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ సినిమాకు పనిచేశారు. ఆ తరువాత చలం హీరోగా రూపొందిన ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి దర్శకుడు కె.యస్.ఆర్.దాస్ వద్ద కూడా అసోసియేట్ గా సాగారు. ఆ పై 1973లో ‘సంసారం- సాగరం’కు దాసరి వద్ద చేరారు. అప్పటి నుంచీ తాను ‘చందమామ’తో డైరెక్టర్ అయ్యే దాకా దాసరి వద్దే పనిచేశారు. తొలి చిత్రం ‘చందమామ’ నిరాశ కలిగించడంతో రేలంగిని ఆయన మిత్రులు కోడి, రవిరాజా పినిశెట్టి ప్రోత్సహించారు. మిత్రుల ప్రోత్సాహంతో ‘నేను- మా ఆవిడ’ తెరకెక్కించి విజయం సాధించారు. వరుసగా రేలంగి తీసిన “ఏమండోయ్ శ్రీమతిగారు, ఇల్లంతా సందడి” సినిమాలు సైతం ఆకట్టుకున్నాయి. దాంతో రేలంగి నరసింహారావు డైరెక్టర్ గా సెటిల్ అయిపోయారు.

రేలంగి నరసింహారావు హాస్యం భలేగా పండించారు. ఆయన చిత్రాలలో రాజేంద్రప్రసాద్ ఎక్కువగా నటించారు. కేవలం కామెడీయే కాకుండా ఏయన్నార్ తో ‘దాగుడుమూతల దాంపత్యం’, శోభన్ బాబుతో ‘సంసారం’ వంటి సెంటిమెంట్ మూవీస్ కూడా తీశారు రేలంగి. కృష్ణంరాజుతో ‘యమధర్మరాజు’ అనే యాక్షన్ సినిమానూ తెరకెక్కించారు. రేలంగి దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరు కిలాడీలు’తోనే సుమన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే ఆయనకు హాస్యచిత్రాలే సక్సెస్ చూపించాయి. ‘ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు- పక్కింటి పెళ్ళాం’ చిత్రాలు తెలుగులో ఘనవిజయం సాధించాయి. వాటిని కన్నడలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. ఆ చిత్రాలు కన్నడనాట కూడా విజయం సాధించడంతో అక్కడా నరసింహారావు బిజీ అయిపోయారు. ఆయన 75వ చిత్రంగా 2016లో ‘ఎలుకా మజాకా’ వెలుగు చూసింది. ఈటీవీ వారికి కొన్ని టీవీ సీరియల్స్ రూపొందించారు.

రేలంగి నరసింహారావు ఎప్పుడూ బిజీగా ఉండేందుకే ప్రయత్నించేవారు. ఓ వేళ ఏ పనీ లేకపోతే గురువు దాసరి నారాయణరావు వద్ద గడిపేవారు. దాసరి చివరలో రూపొందించిన కొన్ని చిత్రాలకు రేలంగి నరసింహారావు గురువు వద్ద మళ్ళీ అసోసియేట్ గా పనిచేయడం విశేషం! ఏదేమైనా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న రేలంగి నరసింహారావు ఇప్పటికీ తన దరికి చేరిన అవకాశాలను వినియోగించుకుంటూనే ఉన్నారు.