హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007 జూన్ 7న విడుదలై వినోదం పంచింది.
కథలోకి తొంగి చూస్తే- దుబాయ్ వెళ్ళి కోట్లు సంపాదించేయాలని కలలు కంటూ ఉంటాడు శ్రీనివాస్. అందరూ అతణ్ణి ‘దుబాయ్ శీను’ అని పిలుస్తూ ఉంటారు. ముంబైలో అతణ్ణీ, అతని మిత్రులను ఓ బ్రోకర్ మోసం చేస్తాడు. అందువల్ల ముంబైలోనే రోడ్ పై ఓ పావ్ బాజీ కొట్టు పెట్టుకొని నెట్టుకొస్తుంటారు. మధుమతి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె శీనును ఆకర్షిస్తుంది. ఆమెకు శీను అబద్ధాల కోరు అని తెలిసి అసహ్యించుకుంటుంది. మధుమతి అన్న, వదినలు హత్యకు గురై ఉంటారు. అందుకు కారణం వారు పనిచేస్తున్న కంపెనీ బాస్ ఓ సంఘవిద్రోహి అన్న విషయం వారికి తెలుస్తుంది. మధుమతి అన్న, శీనుకు ప్రాణమిత్రుడు. మధుమతి వదిన, శీనును సొంత అన్నలా చూసుకుంటూ ఉంటుంది. అలాంటి వారిని చంపిన వాని కోసం శీను తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్ వచ్చి తన అక్కవాళ్ళ ఇంట్లో ఉంటాడు శీను. అతని బావ ఓ పోలీస్ ఆఫీసర్. ఇక మధుమతికి మామ వరుస అయ్యే బాబ్జీ కూడా సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఎలాగైనా మధుమతిని సొంతం చేసుకోవాలని తపిస్తుంటాడు బాజ్జీ. అయితే, శ్రీను ఫ్రెండ్ ను చంపిన వానికి ఈ బాబ్జీ కూడా తొత్తులా పనిచేస్తుంటాడు. చివరకు అసలు వాడిని బయటకు లాగి, వాణ్ణి అంతమొందిస్తాడు శీను. చివరకు శీను పోలీస్ ఇన్ స్పెక్టర్ కావడంతో కథ ముగుస్తుంది.
ఇందులో రవితేజ, నయనతార, జె.డి.చక్రవర్తి, సుశాంత్ సింగ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సునీల్, భానుచందర్, షయాజీ షిండే, రఘుబాబు, సుప్రీత్, కృష్ణభగవాన్, వేణుమాధవ్, శ్రీనివాసరెడ్డి నటించగా, డైరెక్టర్ శ్రీను వైట్ల స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, సాహితి పాటలు రాశారు. “దివాలీ హోలీ…”, “కోల్ కోల్…”,” శీను శీను…”, “కన్యారాశీ…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. అప్పట్లో 250 థియేటర్లలో విడుదలైన ‘దుబాయ్ శీను’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా విడుదలైన వారానికే రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘శివాజీ’ విడుదలైనప్పటికీ ‘దుబాయ్ శీను’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. శతదినోత్సవం చూసింది. ‘ఖతర్నాక్’ పరాజయం తరువాత రవితేజకు ‘దుబాయ్ శీను’ ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పవచ్చు. “నీ కోసం, వెంకీ” చిత్రాల తరువాత రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన ఈ మూడో సినిమా వారికి హ్యాట్రిక్ అందించిందనే చెప్పాలి.