సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, నడిచే చర్చలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లేం చేస్తుంటారు? ఎవరితో ఎఫైర్‌లో ఉన్నారు? అనే విషయాలే నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ట్రోల్స్ కూడా వెలుగు చూస్తుంటాయి. తనపై అలాంటి ట్రోల్స్ రావడంతో కోపాద్రిక్తుడైన నటుడు రాకేశ్ బాపత్.. కర్ర విరగకుండా పాము చచ్చినట్టు ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో రాకేశ్ బాపత్ ప్రేమాయణం నడిపాడు. వీరి జంటకు మంచి ఆదరణే లభించింది. షోలో ఉన్నంతవరకూ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచేలా వీళ్లు మెలగడం, బయటకొచ్చాక కూడా తమ ప్రేమను కొనసాగించడం చూసి.. వీళ్లు త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ, వీళ్లు విడిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ, పరోక్షంగా తమ బ్రేకప్‌ను ప్రస్తావించారు. దీంతో.. వీరి బ్రేకప్‌కు రాకేశ్ కారణమని పలువురు అతడ్ని ట్రోల్ చేయడం ప్రారంభించాడు. దీంతో అతడు వాళ్ల నోళ్లు మూయించేలా ఓ పోస్ట్ పెట్టాడు.
‘‘ఎవరు డేటింగ్ చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరి ఫ్యామిలీ ఉన్నతమైంది, ఎవరిది చెత్త ఫ్యామిలీ? ఎవరికోసం ఎవరు నిలబడుతున్నారు? వంటి విషయాల్ని పక్కనపెట్టేసి.. నా లక్ష్యం ఏంటి? నేను సమాజానికి ఏమివ్వాలి? నా కుటుంబానికి నేనేం చేయగలను?నా దగ్గరున్న డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా నేను ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి? వంటి అంశాలపైన ఫోకస్ చేయండి. ఇదేమంతా కష్టం కాదు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే.. కచ్ఛితంగా వాటిని అనుసరించేందుకు ఇష్టపడతారు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాకేశ్ రాసుకొచ్చాడు.
సూటిగా సుత్తిలేకుండా చెప్పాలంటే.. పక్కనోడి జీవితం గురించి ఆలోచించడం మానేసి, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటూ రాకేశ్ గట్టిగానే చెప్పాడన్నమాట! ఈ దెబ్బకు ట్రోలర్స్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇదిలావుండగా.. కొన్ని వారాల క్రితం షమితా శెట్టి ‘ఓ మంచి బంధం కూడా ముగిసింది’ అంటూ వీరి బ్రేకప్‌ని పరోక్షంగా వివరించింది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.