NTV Telugu Site icon

Naga Shaurya: ‘రంగబలి’ రిలీజ్ డేట్ లాక్ చేశారుగా!

Rangabali

Rangabali

Rangabali: యంగ్ హీరో నాగశౌర్య మంచి హిట్ కోసం కొద్దికాలంగా ఎదురుచూస్తున్నాడు. ‘ఓ బేబీ’ తర్వాత అతని అక్కౌంట్ లో సాలీడ్ హిట్ అనేది పడలేదు. సొంత బ్యానర్ లో వచ్చిన ‘అశ్వద్థామ’, ‘వరుడు కావలెను’ ఫర్వాలేదనిపించినా, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పరాజయం పాలయ్యాయి. ఇక ఈ యేడాది వచ్చిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య చేస్తున్న సినిమా ‘రంగబలి’. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో పవన్ బాసింశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయ్యింది. అయితే ఎలాంటి హడావుడీ ఆర్భాటం లేకుండా షూటింగ్ పూర్తి చేసేశారు. ఉగాదికి మాత్రం ఓ చిన్నపాటి గ్లిమ్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఠక్కున మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. ఈ సందర్భంగా నాగశౌర్య ట్రెండీ గెటప్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. బట్… సినిమాకు సంబంధించిన కథ, కమామీషును మాత్రం రివీల్ చేయలేదు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సిహెచ్ పవన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వెనుకే సొంత బ్యానర్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ నాగశౌర్య మరో సినిమా చేస్తున్నాడు. ‘రంగబలి’ చిత్రానికి దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ కాగా కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Show comments