ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పలు మీడియా సంస్థలు ఈ సందర్భంగా అన్ సంగ్ హీరోస్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అండమాన్ లో ఆజన్మాంత ఖైదీగా జీవితాన్ని గడిపారు వినాయక్ దామోదర సావర్కర్. ఆయన చరిత్రను రకరకాల కారణాల వల్ల ఎవరికి తోచిన విధంగా వారు అన్వయిస్తున్నారు. హిందుత్వ వాది అయిన కారణంగా వీర సావర్కర్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదనే విమర్శ కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సావర్కర్ గురించిన విశేషాలు, వివరాలు జనం ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘స్వాతంత్ర వీర సావర్కర్’ పేరుతో ఓ బయోపిక్ తీయబోతున్నారు. ఇందులో సావర్కర్ పాత్రను రణదీప్ హుడా పోషించబోతున్నాడు. ఇది అతనికి రెండో బయోపిక్. గతంలో రణదీప్ ‘సరబ్జీత్’ బయోపిక్ లో నటించాడు. దానిని నిర్మించిన సందీప్ సింగ్ ‘స్వాతంత్ర వీర సావర్కర్’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.
ఈ సినిమా గురించి మహేశ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, ”దాదాపు యేడాదికి పైగా ఈ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. సావర్కర్ గురించి రకరకాల అభిప్రాయాలను జనం వెలిబుచ్చుతున్న ఈ తరుణంలో ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించడం సమంజసంగా అనిపిస్తోంది. సావర్కర్ లాంటి స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు. సావర్కర్ పాత్ర పోషిస్తున్న రణదీప్ హుడా మాట్లాడుతూ, ”దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు కృషి చేశారు. కానీ కొంతమందికి మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదు. అందులో వీరసావర్కర్ కూడా ఒకరు. ఆయనను అర్థం చేసుకున్న వారికంటే అపార్థం చేసుకున్న వారే ఎక్కువే. అలాంటి అన్ సంగ్ హీరో పాత్రను పోషించే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ యేడాది జూన్ లో షూటింగ్ ప్రారంభిస్తామని, మహారాష్ట్ర, లండన్, అండమాన్, నికోబార్ దీవులలో షూటింగ్ జరుపుతామని నిర్మాతలలో ఒకరైన ఆనంద్ పండిట్ తెలిపారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి దేశ వ్యాప్తంగా చక్కని గుర్తింపు లభించడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి ఇప్పుడు హిందుత్వ వాదుల జీవిత చరిత్రల పైకి మళ్ళినట్టు అనిపిస్తోంది. స్వాతంత్ర వీర సావర్కర్ బయోపిక్ ను ఈ సమయంలో నిర్మించడానికి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు దక్కిన విజయం కూడా ఓ కారణం కావచ్చు.