Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?

Ranabaali Box Office Collection

Ranabaali Box Office Collection

Ranabaali Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత భారీ పందెం నడుస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ స్థాయి సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, ఈసారి పాత లెక్కలన్నీ సెటిల్ చేసేందుకు ‘రణబాలి’తో రంగంలోకి దిగాడు. దసరా కానుకగా ఈ రోజు (అక్టోబర్ 16న) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో విజయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పీరియాడిక్ వార్ డ్రామా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కాలంటే కనీవినీ ఎరుగని రేంజ్‌లో వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రణబాలి’ ప్రాజెక్ట్‌కు సంబంధించి నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు రూ. 60 కోట్ల మేర ముందస్తు రికవరీ వచ్చేసింది. ఇక మిగిలిన బ్యాలెన్స్ అంతా థియేట్రికల్ రన్‌పైనే ఆధారపడి ఉంది.

ఈ చిత్ర థియేట్రికల్ బిజినెస్ రూ. 60 కోట్ల రేంజ్‌లో జరిగినట్లు ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. అంటే సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలన్నా, బయ్యర్లు లాభాల బాట పట్టాలన్నా బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 60 కోట్ల షేర్ (దాదాపు రూ. 120 కోట్ల గ్రాస్) వసూలు చేయక తప్పదనే చర్చ జోరుగా సాగుతుంది. విజయ్ దేవరకొండ మార్కెట్‌కు ఇది నిజంగా అగ్నిపరీక్షే అయినా, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో టీమ్ అంతకుమించిన వసూళ్లనే టార్గెట్ చేస్తోందట. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాయలసీమ యాసపై పట్టు సాధించడం దగ్గర నుంచి రగ్గడ్ మేకోవర్, రిస్కీయెస్ట్ యాక్షన్ ఫైట్స్, హార్స్ రైడింగ్ వరకు ప్రత్యేక శిక్షణ తీసుకుని ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా జీవించేశాడు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ 19వ శతాబ్దపు నాటి రాయలసీమ మహా కరువును, బ్రిటిష్ పాలనలోని అరాచకాలను ఎంతో తీవ్రమైన భావోద్వేగాలతో తెరపైకి తెచ్చారు. మేకింగ్ వీడియోలు, డాక్యుమెంటరీ గ్లింప్స్‌లు ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటికి తోడు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం సినిమాకు భారీ ప్లస్ పాయింట్‌గా మారింది. ఇందులో రణబాలి భార్య ‘జయమ్మ’గా రష్మిక కనిపించనుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డో ఓస్లో బ్రిటిష్ అధికారిగా విలనిజాన్ని పండించాడు. అంచనాలు ఆకాశంలో ఉన్న వేళ, దసరా పండుగ సీజన్ కలిసివచ్చి ఈ రూ. 120 కోట్ల గ్రాస్ టార్గెట్‌ను రౌడీ బాయ్ సునాయాసంగా దాటేస్తాడా లేదా అన్నది ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.