NTV Telugu Site icon

Rana: ‘భీమ్లా నాయక్’ చేయడానికి కారణం అదే..!!

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్‌ మీద బేస్ చేసి తీసిన సినిమా కావడంతో తన జానర్ మూవీ అనిపించిందని, అందుకే ఈ మూవీలో నటించినట్లు రానా తెలిపాడు. కథలో కొత్తదనం తప్పితే కమర్షియాలిటీ గురించి తాను పట్టించుకోనని, అయితే ఇలాంటి డిఫరెంట్‌ జానర్ మూవీలోనూ హీరోయిజాన్ని అద్భుతంగా చొప్పించడం త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ చంద్రకే సాధ్యమైందని, పవన్ లాంటి స్టార్ హీరో యాడ్ అయిన తర్వాత మూవీ రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నాడు. మాతృకలోని మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని వర్క్ చేశారని కితాబిచ్చాడు. కొన్ని సన్నివేశాలు మాతృకకు దగ్గరగా ఉండటంతో వాటిని తీసేసి, రీ-షూట్ చేసిన సందర్భాలూ ఉన్నాయన్నాడు.

అనారోగ్యంతో దాదాపు రెండేళ్ళు నటనకు దూరంగా ఉన్న తర్వాత హెల్త్ సెట్ అయిన తర్వాత చేసిన సినిమా ఇదని, రిలీజ్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో అక్కడే తెలుగు ప్రేక్షకుల మధ్య ‘భీమ్లా నాయక్’ను చూశానని, వారి స్పందన చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు. దర్శకుడు సాగర్ చంద్ర గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని చూస్తే ఒక్కోసారి ఈర్ష్య కలిగేది. పవన్ కళ్యాణ్, రానా వంటి నటులను ఒకే సినిమాలో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కడం అంటే మాటలు కాదు. అలానే పక్కనే త్రివిక్రమ్ వంటి దర్శకుడు దన్నుగా నిలవడం, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి నిర్మాణ సంస్థ లభించడం గొప్ప విషయాలు. అతను కూడా డిఫరెంట్ జానర్స్ ను ఇష్టపడే వ్యక్తి. అందుకే ఎక్కడ కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతని నుండి వైవిధ్యమైన చిత్రాలు మరిన్ని వస్తాయని ఆశించొచ్చు’ అని అన్నారు.

సంయుక్త మీనన్ తో నటించిన సన్నివేశాలు బాగా రావడానికి తాను ఇప్పుడు ఓ ఇంటివాడిని కావడం కారణం కావచ్చని, ఆ అనుభవాలూ తెలియకుండానే నటన మీద ప్రభావం చూపి ఉంటాయని రానా సరదాగా చెప్పాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న ‘రానా నాయుడు’ వెబ్ సీరిస్ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందని, దాని తర్వాతే కొత్త సినిమాకు కమిట్ అవుతానని రానా వెల్లడించాడు. గత కొంతకాలంగా తమన్ సంగీతం మరో లెవెల్‌లో ఉంటోందని, టాలీవుడ్‌కు తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం వరం లాంటిదని, ‘భీమ్లానాయక్’ సంగీతాన్ని తమన్ అదే తరహాలో ఇచ్చాడన్నాడు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్‌తో తను అనుబంధం ఇక మీదట కూడా కొనసాగుతుందని, ఆ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని చెప్పాడు.

Show comments