Site icon NTV Telugu

పవన్ బర్త్ డేకి ముందే రానా సర్‌ప్రైజింగ్ రానుందా !

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం మేరకు రానా పాత్రను పరిచయం చేస్తూ ‘డేని.. డేనియల్‌ శేఖర్‌’ టీజర్ రానున్నట్లు తెలుస్తోంది.

Read Also: దసరాకు ముందే వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’!

సెప్టెంబర్ 2న పవన్‌ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ బర్త్ డే కంటే ముందే రానా సర్‌ప్రైజింగ్ వీడియో తీసుకురావాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక రానా పరిచయం లేకుండా మరోసారి పవన్ వైపునే అప్డేట్ ఇస్తే మరింత విమర్శలు వచ్చే ఆస్కారం ఉండటంతో ఆరకంగా అప్డేట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నారు. నిత్యామేనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version