Rana Daggubati: యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు. తాత రామానాయుడు పేరునే పెట్టుకున్న రానా ఆయన అడుగుజాడల్లోనే పయనిస్తూ నటన, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ఇక వ్యాఖ్యాతగా, సమర్పకునిగానూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. తమ దగ్గుబాటి ఫ్యామిలీలోనే తన రూటే సెపరేటు అంటున్నారాయన. మరో చెప్పాలంటే వారి ఫ్యామిలీలో ‘లక్కీ బోయ్’ రానాయే అనీ అనవచ్చు. ఎందుకంటే రానా పుట్టినరోజునే, అంటే 1984 డిసెంబర్ 14న వారి సొంత నిర్మాణ సంస్థ ‘సురేశ్ ప్రొడక్షన్స్’ నిర్మించిన ‘కథానాయకుడు’ విడుదలై విజయఢంకా మోగించింది. అలా రామానాయుడుకు కలిసొచ్చిన మనవడు రానా.
మద్రాసులో జన్మించిన రానాకు అక్కడ నుంచీ ఇక్కడి దాకా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే రామ్ చరణ్ అనే చెప్పాలి. ఇద్దరూ కలసి చదువుకున్నారు. ఇప్పటికీ అదే అన్యోన్యతతో సాగుతున్నారు. చెర్రీ తన తండ్రి చిరంజీవి బాటలో పయనిస్తూ నటనలోనే ముందుగా అడుగుపెట్టారు. కానీ, రానా మాత్రం తొలుత ‘విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ’ నిర్వహించారు. తరువాత నిర్మాణ భాగస్వామిగా ‘బొమ్మలాట’ నిర్మించారు. తాత రామానాయుడు నటుడు కావాలని కొన్ని చిత్రాలలో నటించారు కూడా. అయితే బాబాయ్ వెంకటేశ్ స్టార్ హీరోగా జేజేలు అందుకోవడం రానా ప్రత్యక్షంగా చూశారు. దాంతో రానాకు కూడా నటించాలన్న అభిలాష కలిగింది. రానా తాత రామానాయుడు ఒకప్పుడు బాపట్ల ఎమ్.పి.గా ఉన్నారు. అందువల్ల రానాకు కూడా రాజకీయాలంటే ఆసక్తి. చిత్రంగా రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’లో ఆయన రాజకీయనాయకునిగానే నటించడం విశేషం! మరో విశేషమేమంటే, తమ సురేశ్ ప్రొడక్షన్స్ ‘కథానాయకుడు’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బాలయ్య నిర్మించి, నటించిన ‘కథానాయకుడు’లో రానా నటించారు. ఈ సినిమా సీక్వెల్ లోనూ రానా కనిపించారు. ఈ రెండు చిత్రాలలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించడం ఓ ప్రత్యేకత అనే చెప్పాలి. ‘నారా’ పేరును తిప్పేస్తే ‘రానా’ వస్తుంది కాబట్టి నిజంగా ఆ పాత్ర రానాకు స్పెషల్ అనే చెప్పవచ్చు. ‘నేనే రాజు- నేనే మంత్రి’లోనూ రానా రాజకీయ నాయకునిగానే కనిపించడం ఇంకో విశేషం!
తన తరం నటులతో పోలిస్తే, రానా తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించేశారు. అందువల్ల పలు జానర్స్ లో నటించగలిగారు. జానపద, చారిత్రక పాత్రల్లో నటించారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో కొన్ని పౌరాణిక పాత్రలూ ధరించారు. రానా తరం హీరోల్లో అది ఆయనకే సాధ్యమయింది. హిందీ, తమిళ భాషల్లోనూ రానా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ రానా ప్రతినాయకుడు భల్లాల దేవునిగా కనిపించి అలరించిన తీరును జనం మరచిపోలేరు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’లో డేనియల్ పాత్రలోనూ రానా తనదైన బాణీ పలికించారు.
రానాకు ఆయన వాచకం ఓ ఎస్సెట్ అని చెప్పొచ్చు. అందువల్ల “విన్నర్, సుబ్రహ్మణ్యపురం” చిత్రాలలో వ్యాఖ్యాతగా వాయిస్ వినిపించారు. ఇక హాలీవుడ్ మూవీస్ “అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్ గేమ్” తెలుగు అనువాదాల్లోనూ రానా ‘థానస్’ అనే పాత్రకు డబ్బింగ్ చెప్పారు. బాబాయ్ వెంకటేశ్ తో కలసి రానా ‘కృష్ణం వందే జగద్గురుం’లో ఓ పాటలో నర్తించారు. ప్రస్తుతం బాబాయ్ వెంకటేశ్ తో కలసి రానా ‘రానా-నాయుడు’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తూ ఉన్నారు, నెట్ ఫ్లిక్స్ లో ఇది విడుదల కానుంది. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్న రానా రాబోయే రోజుల్లోనూ తన చిత్రాల్లో వెరైటీ రోల్స్ లో అలరిస్తారని ఆశిద్దాం.