టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి స్థల వివాదంలో కోర్టు మెట్లెక్కాడు. టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. వివాదాలు, కేసులకు ఈ ఫ్యామిలీ ఎప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ ఒక స్థల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి, తనను దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేసిందంటూ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఫిల్మ్ నగర్ లో దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబుల పేరున 2220 గజాల స్థలం ఉంది. అయితే గత కొన్నేళ్ళనుంచి ఈ స్థలాన్ని ఒక వ్యక్తికి దగ్గుబాటి కుటుంబం లీజ్ కు ఇచ్చింది.
కాగా, లీజ్ గడువు ముగియక ముందే దగ్గుబాటి ఫ్యామిలీ తనను స్థలం ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తున్నారని, తనకు తెలియకుండా ఆ స్థలంలోని 1000 గజాల స్థలాన్ని రానా పేరు మీద రిజిస్టర్ చేసినట్లు సదురు వ్యక్తి ఆరోపిస్తూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు రానాను విచారణకు హాజరు కావాలని కోరగా మంగళవారం రానా కోర్టుకు హాజరు అయ్యినట్లు తెలుస్తోంది. లీజు గడువు ఎప్పుడో పూర్తయిన సదురు వ్యక్తి స్థలాన్ని ఖాళీ చేయకుండా ఉండడం వలనే దగ్గుబాటి ఫ్యామిలీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.