Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

Ramyakrishna

Ramyakrishna

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎవర్‌గ్రీన్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అప్పుడప్పుడు దీనిపై కృష్ణ వంశీ స్పందిస్తారు కానీ రమ్యకృష్ణ స్పందించడం అరుదు. తాజాగా ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు రమ్యకృష్ణ స్వయంగా స్పందించి అసలు విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తమ పెళ్లికి ముందు కృష్ణవంశీ పెట్టిన ఓ షాకింగ్ కండీషన్ గురించి కూడా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా ‘రా టాక్స్ విత్ వీకే’ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ తన వైవాహిక జీవితంపై ఓపెన్ అయ్యారు. పెళ్లికి ముందు కృష్ణవంశీ తనతో అన్న మాటలను గుర్తుచేసుకుంటూ నవ్వేశారు. “మాకు పెళ్లి కాకముందు కృష్ణవంశీ నాకో మాట చెప్పారు. మనం పెళ్లి చేసుకోకుండా ఊరికే కలిసి ఉందామా అని అడిగారు. అప్పట్లో ఆయన చెప్పినట్టు విని ఉంటే బాగుండేదనిపిస్తోంది. కానీ నేను మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాను” అంటూ రమ్యకృష్ణ సరదాగా చెప్పుకొచ్చారు.

రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉండటమే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమని, అందుకే విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ.. “మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మేము విడిపోవడం లేదు. కేవలం మా కెరీర్, కొడుకు కోసమే ఇలా రెండు నగరాల్లో ఉంటున్నాం. గతంలో నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సీరియల్ షూటింగ్స్ కోసం నెలలో 15 రోజులు చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. ఇలా తరచూ ప్రయాణాలు చేయడం వల్ల మా అబ్బాయి రిత్విక్ ఆరోగ్యం దెబ్బతింది. అందుకే ఇద్దరం మాట్లాడుకుని, నేను బాబుతో కలిసి చెన్నైలో ఉండాలని, ఆయన హైదరాబాద్‌లో ఉండి సినిమా పనులు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని వివరించారు. చెన్నైలో కొడుకును స్కూల్లో చేర్పించి అక్కడే సెటిల్ అవ్వడం తమ కాపురానికి ఎంతో మేలు చేసిందని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉండటం వల్ల రోజూ ఎదురుపడి గొడవలు పడే అవకాశమే లేకుండా పోయిందని, ఈ ఏర్పాటు తర్వాత తామిద్దరం మరింత మంచి స్నేహితులయ్యామని తెలిపారు. 23 ఏళ్లుగా తమ వివాహ బంధం ఇంత బలంగా నిలబడటానికి ఇదే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. గతంలో కృష్ణవంశీ కూడా ఈ విడాకుల వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా రమ్యకృష్ణ ఇచ్చిన వివరణతో ఈ పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది.