Why Ramayana Trailer Postponed: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై మరో కీలక ప్రకటన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే చివరి నిమిషంలో ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు.
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా సందర్భంగా నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘రామాయణ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలన్న నా కల ఇప్పుడు నిజమైంది. ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విడుదల చేయడానికి సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామిగా చేరింది. ఈ భాగస్వామ్యంతో భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రామాయణను విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ట్రైలర్‌ను కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం వాయిదా వేస్తున్నాము. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాము’ అని నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, పురాణాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశంగా రామాయణ నిలవబోతోందని నమిత్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఈ ప్రయాణానికి అండగా నిలిచిన అభిమానులు, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారత యువతే దేశ భవిష్యత్తని పేర్కొంటూ.. మన సంస్కృతి, విలువలను కాపాడే బాధ్యత అందరిదీ అని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
సుమారు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి విడుదల ప్రణాళికతో తెరకెక్కుతున్న రామాయణపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ట్రైలర్ విడుదల వాయిదా పడినా.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లాంచ్ కోసం చిత్రబృందం సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
#Ramayana Trailer Postponed !! pic.twitter.com/mLLzsju5OV
— The Ramayana 🏹 (@RamayanaSaga) July 23, 2026

