వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏది అనిపిస్తే అది అనేస్తాడు.. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాడు. ఇక రాజకీయ నేతల బయోపిక్ లు తీయడంలో వర్మ దిట్ట. బయటికి తెలియని ఎన్నో నిజాలను తన బయోపిక్ ల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, ఇక ఇటీవల కొండా లాంటి సినిమాలన్నీ బయోపిక్ లే.. ఇక ఈ సినిమాలను మొదలుపెట్టిన దగ్గరనుంచి విడుదలయ్యేవరకు వివాదాలతోనే వార్తల్లో నిలిచిన వర్మ మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం డేంజరస్ అనే మూవీ తెరకెక్కిన విషయం విదితమే.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ.. ” సీఎం కేసీఆర్ బయోపిక్ సినిమా త్వరలో తీస్తాను. ఇప్పటికే బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్టు రెడీ గా ఉంది. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతాను” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ బయోపిక్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
