NTV Telugu Site icon

RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా

Rajinikanth

Rajinikanth

RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా ఎవ్వరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బస్సు కండెక్టర్ గా మొదలైన రజినీ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెల్సిందే. అయితేపేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రజినీ నేడు చెన్నైలో హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను మంచి నటుడని అందరు అంటూ ఉంటారు. కానీ, దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో తెలియడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ, 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు” అంటూ చెప్పుకొచ్చాడు. తలైవా ఇలా వైరాగ్యంతో మాట్లాడడం అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.