Rajashekar:తన తరం కథానాయకుల్లో డాక్టర్ రాజశేఖర్ ‘యాంగ్రీ యంగ్ మేన్’గా జేజేలు అందుకున్నారు. ఆయన పేరు చెప్పగానే “అంకుశం, మగాడు, ఆక్రోషం, ఆవేశం” వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ తరువాతే ఆయన మిగిలిన చిత్రాలు మన స్మృతిపథంలో మెదలుతాయి. రాజశేఖర్ అంటే సీరియస్ యాక్టర్ అనే ముద్ర నుండి బయట పడడానికి స్టెప్స్ వేసి అలరించారు రాజశేఖర్. ఆ తరువాత తన తీరే వేరు అన్నట్టుగా రాజశేఖర్ సాగారు. ఇప్పటికీ రాజశేఖర్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. తెలుగునాట తనయులు హీరోలుగా నటిస్తున్నా, స్టార్స్ గా రాణిస్తున్నారు కొందరు. కానీ, హీరోయిన్స్ గా కూతుళ్ళు వచ్చాక కూడా యాక్షన్ మూవీస్ లో నటిస్తూ సాగుతున్నారు రాజశేఖర్. ఆయన కూతుళ్ళు శివానీ, శివాత్మిక ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ గా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మునుపటి స్పీడు లేకపోయినా, ఇప్పటికీ రాజశేఖర్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు మాత్రం ఉన్నారు.
ఇప్పుడంటే రాజశేఖర్ ఇలా ఉన్నారు కానీ, అప్పట్లో తన టైటిల్ కు తగ్గట్టే తెరపై, బయటా ‘యాంగ్రీ మేన్’గానే సాగారు రాజశేఖర్. తన తరం హీరోల్లో చాలామంది కేరెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయిపోయినా, రాజశేఖర్ మాత్రం ఇప్పటికీ హీరోగా అలరించే ప్రయత్నమే చేస్తున్నారు. ఒకప్పుడు ‘పోలీస్ రోల్స్’ చేయాలంటే రాజశేఖరే అన్న పేరు సంపాదించారు. ఇప్పుడు కూడా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారాయన. రాజశేఖర్ ముక్కుసూటి తనంలోనూ మార్పు లేదు. మనసులో ఏముంటే అది బయటపెట్టేస్తారు. అందుకే కొన్నిసార్లు ఆయన వివాదాలకు కేంద్రబిందువవుతూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉన్నా, రాజశేఖర్ మనసు వెన్నపూస అంటారు సన్నిహితులు.
రాజశేఖర్ పాత్రల్లో ఆవేశమే కాదు, ఆలోచింప చేసే విధానం కూడా కనిపిస్తుంది. అలాంటి తనకు నచ్చిన పాత్రలనే ఆయన ఎంపిక చేసుకుంటూ ఉంటారు. రౌద్ర రస పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన రాజశేఖర్, కరుణ రసాన్నీ పండించిన సందర్భాలున్నాయి. ఆ పాత్రల్లోనూ ఆయన అలరించిన తీరు మరపురానిది. రాజశేఖర్ కు వైవిధ్యమంటే ప్రాణం. ఆరంభంలో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ అలరించారు. ఆ సమయంలోనే కొన్ని చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లోనూ పలకరించారు. అక్కడా తనదైన బాణీ పలికించారు. ‘తలంబ్రాలు’లో రాజశేఖర్ విలనీ కూడా జనాన్ని ఆకట్టుకుంది. బెస్ట్ విలన్ గా నంది అవార్డునూ సొంతం చేసుకున్నారు.
రాజశేఖర్ షూటింగ్స్ కు సరైన సమయానికి రారు అనే పేరు సంపాదించారు. అయినా కొన్ని పాత్రలకు రాజశేఖర్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన వారు ఆయననే తమ హీరోగా ఎంచుకునేవారు. రావడంలో ఆలస్యం ఉంటుందేమో కానీ, వచ్చిన తరువాత అందరూ మెచ్చేలా నటించడానికి తపించేవారు రాజశేఖర్. అందుకే ఆయన ఎప్పుడు వచ్చినా సరే, అదే భాగ్యం అనుకుంటూ చిత్రాలు రూపొందించి విజయం సాధించారు సినీజనం. అనేక పాత్రల్లో తనదైన అభినయంతో అలరించిన రాజశేఖర్ ఈ నాటికీ హీరోగానే సాగుతున్నారు. గత సంవత్సరం ‘శేఖర్’ సినిమాలో నటించిన రాజశేఖర్ ఈ యేడాది కూడా తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.