సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్‌తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..!
గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ రజనీ కాంత్. ఓ రకంగా చెప్పాలంటే.. శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ తరువాత.. ఇప్పటివరకు రజినీకి ఆ స్థాయి హిట్ పడలేదనే చెప్పాలి. అయితే మధ్యలో వచ్చిన 2.O, పేట.. సినిమాలు కాస్త పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చి న ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ప్రస్తుతం రజినీ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందులోభాగంగా.. సన్ పిక్చర్స్ బ్యానర్లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా ‘బీస్ట్’ సినిమాను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. రజనీకాంత్ 169వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. అయితే బీస్ట్ సినిమా ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ.. నెల్సన్‌తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు తలైవా. ఇక ఈ చిత్రానికి రజినీనే స్వయంగా కథను అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రజనీకి జోడీగా ఐశ్వర్యారాయ్ నటించబోతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక అరుళ్ మోహన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి భారీ బడ్జెట్.. రజనీ-ఐశ్యర్య జోడీ.. తలైవా కథతో రాబోతున్న ఈ సినిమా.. రజనీకి ఎలాంటి హిట్‌ను అందిస్తుందో చూడాలి.
