నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్.
రఘువరన్ 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడెలో జన్మించారు. ఆయన తండ్రి హోటల్ నడిపేవారు. మధురలో హోటల్ నడుపుతున్న ఆయన తండ్రి తరువాత కొయంబత్తూరుకు మకాం మార్చారు. అక్కడే రఘువరన్ విద్యాభ్యాసం సాగింది. బి.ఏ., చదువుతూ దానిని వదలివేసి, మద్రాసు అడయార్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. తరువాత ఓ కన్నడ చిత్రంలో నటించారు. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. మాతృభాష మళయాళంలో ‘కాక్క’ అనే సినిమా కాసింత గుర్తింపు సంపాదించి పెట్టింది. తరువాత ‘ఎలవత్తు మణిదన్’ తమిళ చిత్రంలో తొలిసారి హీరోగా నటించారు రఘువరన్. అప్పట్లో రఘువరన్ ను చూసి, అచ్చు ఉత్తరాది హీరోలా ఉన్నాడని అందరూ భావించారు. “ఒరు ఒడై నాదియగిరతు, నీ తోడుంబోతు, ఎన్గిరుందలుమ్ వళ్గా” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ రాణించారు. తెలుగులో విజయం సాధించిన వెంకటేశ్ మూవీ ‘బ్రహ్మపుత్రుడు’ను తమిళంలో ‘మైఖేల్ రాజా’గా డి.రామానాయుడు రీమేక్ చేశారు. అందులో రఘువరన్ హీరోగా నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రఘువరన్ విలక్షణమైన పాత్రల్లో రాణించాలని తపించేవారు. అందువల్ల ఎప్పుడూ హీరో వేషాలు వేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. దాంతో విలన్ గా అలరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలుగు చిత్రం ‘పసివాడి ప్రాణం’తో విలన్ గా తెలుగుజనానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా ఘనవిజయంతో తెలుగులో రఘువరన్ కు విలన్ పాత్రలే పలకరించడం మొదలెట్టాయి.
రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లోనూ రఘువరన్ విలన్ గా నటించారు. ఆ సినిమా ఘనవిజయంతో రఘువరన్ అంటే విలన్ అనే పేరు సంపాదించారు. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ రఘువరన్ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో బిజీ విలన్ గా సాగారాయన. మణిరత్నం ‘అంజలి’లో మళ్ళీ కథానాయకునిగా కనిపించారు. కానీ, ఆయనకు తరువాత హీరో వేషాలు అంతగా పలకరించలేదు. ఆ తరువాత నుంచీ కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తూ సాగారు. ‘సుస్వాగతం’లో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు రఘువరన్.
ఒకప్పుడు బాలనటిగా భళా అనిపించిన రోహిణిని పెళ్ళాడారు రఘువరన్. వాళ్ళకు ఓ అబ్బాయి పేరు రిషి వరన్. 2004లో రోహిణి నుండి విడిపోయారు. ఆల్కహాల్ కు బానిస అయిన రఘువరన్ రాత్రిపగలు తేడాలేకుండా తాగేవారు. దాంతో ఆయన అవయవాలు బాగా దెబ్బతిన్నాయి. 2008 మార్చి 19న రఘువరన్ కన్నుమూశారు. రఘువరన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ‘ట్రినిటీ కాలేజ్’లో పియానో నేర్చుకున్నారు. సొంతగా పాటలు కంపోజ్ చేసుకొని మురిసిపోయేవారు. ఆయన కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను తరువాత ఓ ఆల్బమ్ గా తీసుకువచ్చారు. రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైన ఈ ఆల్బమ్ ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన అభినయం జనం మదిలో ఓ స్థానం సంపాదించింది.