Site icon NTV Telugu

గుండెల్ని పిండేస్తున్న ‘రాధేశ్యామ్’లోని ‘సోచ్ లియా’ సాంగ్!

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం అనేది ఇప్పటి వరకూ జరుగుతోంది.

కానీ ‘రాధేశ్యామ్’ ఈ విషయంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే హిందీలో ‘ఆషికీ ఆ గయీ’ పాటను విడుదల చేసిన నిర్మాతలు తాజాగా ‘సోచ్ లియా’ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇలా విడుదలైందో లేదో అలా వైరల్ గా మారిన ఈ పాట ‘రాధేశ్యామ్’ పై పెట్టుకున్న అంచనాలను పదింతలు చేసే విధంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ను ఓ దృశ్య కావ్యంగా దర్శకుడు ‘జిల్’ రాధాకృష్ణ మలిచాడని ఈ పాట చూస్తే అర్థమౌతోంది.

వింటేజ్ లుక్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఒకరితో ఒకరు పోటీ పడ్డారనిపిస్తుంది. ప్రేరణ ప్రేమ కోసం విక్రమాదిత్య ఆరాటపడటం ఈ పాటలో కనిపిస్తుంది. ఆ వేదన గుండెల్ని పిండేసేలా మనోజ్ పరమహంస తెరపై ప్రెజెంట్ చేశాడు. ఈ బ్యూటిఫుల్ మెలోడీకి మిథున్ స్వరరచన చేయగా, మనోజ్ మింతాసిర్ సాహిత్యం అందించాడు. దీన్ని అర్జిత్ సింగ్ అద్భుతంగా పాడాడు. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్‌ ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. ఆస్కార్ విజేత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేసిన ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో జస్టిస్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version