Site icon NTV Telugu

‘పుష్ప’ చిత్రానికి పాన్ ఇండియా కష్టాలు!

pushpa

pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తర్వాత ఆ ఆలోచన మార్చుకుంది. ఇదిలా ఉంటే… కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక పర్యాయాలు ‘పుష్ప’ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఎటూ తెగకపోవడంతో ఈ సినిమా రెండు భాగాలుగా తీయాలని, ఇంతవరకూ షూటింగ్ చేసిన దానిని ఫస్ట్ పార్ట్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పనులు మాత్రం శరవేగంగా సాగలేదు. ఓవైపు అప్పటికే దీనిని దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అక్కడ నుండీ టీమ్‌కు సినిమా కష్టాలు ఎక్కువయ్యాయి. ఒక భాషలో తీసి ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పించడం అంటే మాటలు కాదు… పైగా ప్రతి ఒక్క అప్ డేట్ కూ విశేషమైన ప్రచారం చేయడం మొదలైన తర్వాత ప్రతి చిన్న అంశాన్ని కూడా పర్ ఫెక్ట్ గా జనం ముందుకు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో గతంలో ఒకసారి చేసిన పనిని ఇప్పుడు ఐదు సార్లు చేయాలి.

ఏ పనికి ఎంత సమయం పడుతుంది? అనుకున్న సమయంలో దానిని పూర్తి చేయగలమా లేదా అనే అంచనా లేకుండా ‘పుష్ప’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్ 17కు లాక్ చేసింది. అయితే అన్ని భాషల్లో ది బెస్ట్ ఇవ్వాలని భావించిన దర్శక నిర్మాతలు… అవుట్ పుట్ విషయంలో రాజీ పడకపోవడంతో… అనుకున్న సమయం కంటే ప్రతి స్థాయిలోనూ ఆలస్యం జరుగుతూ వచ్చింది. తెలుగు సినిమా సెన్సార్ కూడా ఒకటికి రెండు సార్లు వాయిదా వేసి చివరకు ఎలాగోలా అయ్యిందనిపించినట్లు టాక్. ఇదిలా ఉంటే పూర్తి స్థాయిలో సినిమాలను సిద్ధం చేయకుండా సెన్సార్ వారికి రగ్ డ్ వర్షన్ చూపించడం ఇటీవల పెద్ద సినిమాల విషయంలో ఎక్కువగా జరుగుతూ వస్తోంది.

అదే పద్ధతిలో తెలుగు వర్షన్ ను అతి కష్టం మీద డెడ్ లైన్ లోగా పూర్తి చేసి సెన్సార్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు పరభాషలపై దృష్టి పెట్టింది. అయితే… అదర్ లాంగ్వేజ్ వర్షన్స్ ను కూడా రగ్ డ్ వెర్షన్స్ తో సెన్సార్ చేయించాలని చూసిన యూనిట్ పై సెన్సార్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. హిందీ సెన్సార్ కోసం పూర్తి స్థాయిలో సినిమాను సిద్ధం చేసి చూపించాలని గట్టగా చెప్పటంతో గురువారం కంప్లీట్ వెర్షన్ తో సెన్సార్ వారికి చూపించబోతున్నారు. సినిమా విడుదలకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో…. యూనిట్ సభ్యులు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారట.

ఇదిలా ఉంటే… జనవరి 7న విడుదల కావాల్సిన మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సెన్సార్ కార్యక్రమాలను దర్శకుడు రాజమౌళి చాలా క్రితమే చాలా సైలెంట్ గా చేయించేశారు. ‘బాహుబలి’ వంటి సినిమాను జాతీయ స్థాయిలో ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేసిన అనుభవం ఉండటంతో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో చాలా పకడ్బందీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్షెన్స్ కాపీలను సిద్ధం చేసుకుని ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. విశేషం ఏమంటే… ‘ట్రిపుల్ ఆర్’ కు సూపర్ క్రేజ్ ఉన్నా… నెల రోజుల ముందునుండే రాజమౌళి పరాయి రాష్ట్రాలలోనూ ప్రచారం మొదలెట్టేశారు. ప్యాన్ ఇండియా సినిమాలకు ప్రచారం ముఖ్యం అంటూ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ యూనిట్ కి గుర్తు చేశారు రాజమౌళి.

ఇదిలా ఉంటే… తెలుగు నిర్మాతలు కొందరు సెన్సార్ సభ్యుల నిర్ణయాలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘రిపబ్లిక్’, ‘అఖండ’ సినిమాల విషయంలో సెన్సార్ సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను దర్శక నిర్మాతలు పట్టించుకోలేదని, దీనిపై సెన్సార్ సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సదరు నిర్మాతలపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారని అంటున్నారు. తాజాగా ప్రాంతీయ సెన్సార్ అధికారిగా ఇటీవల షిఫాలీ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇండియన్ రైల్వేస్ నుండి వచ్చిన ఆమె దగ్గర గతంలో మాదిరి నిర్మాతల పప్పులు ఉడికే అవకాశం లేదన్నది కొందరు చెబుతున్న మాట! సో నిర్మాతలు సెన్సార్ విషయంలో బహుపరాక్!

Exit mobile version