ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కోర్ట్ మెట్లెక్కారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఏమాత్రం చెవిన వేసుకోలేదు. సరికదా మరో పిటిషన్ తో తీర్పును సవాలు చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ ధరల విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ వేయడం చర్చకు దారి తీసింది.
“ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు… మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు… ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని… 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు” అంటూ తాజా ప్రెస్ మీట్లో నాని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాని వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ “నానికి సినిమా కలెక్షన్ల గురించి ఏం తెలుసు? ఆలోచించి మాట్లాడాలి” అంటూ మండిపడ్డారు. దీంతో సినిమా ఇండస్ట్రీ ఈ వివాదం వల్ల రెండుగా చీలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వర్గం ఒకటి, ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వర్గం ఒకటి. ఏదేమైనా రేపు మరోసారి కోర్టులో విచారణకు రానున్న ఈ వివాదంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also :
