(ఆగస్టు 18న జయకృష్ణ జయంతి)
చేయి తిరిగిన మేకప్ మేన్ గా పేరు సంపాదించిన జయకృష్ణ, నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. జయకృష్ణ మేకప్ కారణంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తెరపై అందంగా కనిపించి జనం మదిని దోచారు. అందువల్ల మేకప్ మేన్ అన్న పదం కాకుండా ‘రూపశిల్పి’ జయకృష్ణ అన్న పేరును సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితునిగా ఉండేవారు జయకృష్ణ. కృష్ణంరాజు హీరోగా తెరకెక్కి విజయం సాధించిన ‘కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం’ వంటి చిత్రాలలో జయకృష్ణ రూపకల్పనలోనే నటీనటులు మరింత అందంగా, వారి పాత్రలకు తగ్గట్టుగా తెరపై కనిపించారు. మిత్రుడు కృష్ణంరాజు ప్రోత్సాహంతోనే జయకృష్ణ నిర్మాతగా మారారు.
నాటి మేటి మేకప్ మెన్ భక్తవత్సలం, పీతాంబరం వంటి వారివద్ద మేకప్ కళలో మెలకువలు తెలుసుకున్న జయకృష్ణ తన క్రియేటివిటీతో తారల గ్లామర్ కు మరిన్ని వన్నెలు అద్దారు. ‘చిలకా-గోరింకా’తో హీరోగా ప్రవేశించినా, తరువాత విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మారిన కృష్ణంరాజును పలు చిత్రాల్లో అందంగా కనిపించేలా రూపకల్పన చేశారు జయకృష్ణ. కృష్ణంరాజు తాను హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో గోపీకృష్ణా మూవీస్ పతాకం స్థాపించి, సొంతగా చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో జయకృష్ణ మేకప్ కృష్ణంరాజుకు దన్నుగా నిలచిందని చెప్పక తప్పదు. రూపశిల్పిగా మంచి పేరు సంపాదించిన తరువాత జయకృష్ణ కూడా నిర్మాతగా మారారు.
తొలి ప్రయత్నంగా కన్నడలో విజయం సాధించిన ‘పడువారల్లి పాండవరు’ చిత్రం ఆధారంగా తెలుగులో ‘మనవూరి పాండవులు’ తెరకెక్కించారు. జయకృష్ణా మూవీస్ పతాకంపై బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు కృష్ణంరాజు సమర్పకునిగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో పంచపాడవులలో అర్జునునిగా చిరంజీవి కనిపించారు. చిరంజీవి మొట్టమొదట పారితోషికం అందుకున్న చిత్రం ఇదే కావడం విశేషం. జయకృష్ణ ఆ రోజుల్లో చిరంజీవికి వెయ్యిన్నూట పదహార్లు పారితోషికం ఇచ్చారు. అలా జయకృష్ణ చేతి చలువ మహిమేమో కానీ, చిరంజీవి తరువాతి రోజుల్లో స్టార్ గా, మెగాస్టార్ గా వెలుగొందారు. ఒకానొక దశలో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్ గా నిలిచారు చిరంజీవి.
‘మనవూరి పాండవులు’ విజయం తరువాత కృష్ణంరాజు, జయప్రద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘సీతారాములు’ నిర్మించారు జయకృష్ణ. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా దాసరి దర్శకత్వంలోనే ‘కృష్ణార్జునులు’ నిర్మించారు. తరువాత ముద్దు ఆర్ట్ మూవీస్ అనే మరో బ్యానర్ పెట్టి, చిరంజీవి హీరోగా ‘మంత్రిగారి వియ్యంకుడు’ను బాపు దర్శకత్వంలో నిర్మించారు జయకృష్ణ. ‘ఖైదీ’ విడుదలైన వారానికే జనం ముందు నిలచిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ మంచి వినోదం పంచింది. కానీ, ‘ఖైదీ’ దాటికి తట్టుకోలేకపోయిందనే చెప్పాలి. తరువాత బాపు దర్శకత్వంలోనే మోహన్ బాబు కథానాయకునిగా ‘సీతమ్మ పెళ్ళి’ నిర్మించారు. ఇది కాగానే జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’ తెరకెక్కించారు. సుహాసిని నాయికగా రూపొందిన ఈ చిత్రం జనాదరణ పొందింది. దాంతో సుహాసినితోనే క్రాంతి కుమార్ డైరెక్షన్ లో ‘స్రవంతి’ చిత్రం రూపొందించారు. ఈ సినిమాతో సుహాసినికి నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆపై బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, సుహాసిని జంటగా ‘జాకీ’ చిత్రం నిర్మించారు జయకృష్ణ.
ఏది ఏమైనా ‘సీతారాములు’ తరువాత జయకృష్ణకు ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. అయితే జయకృష్ణ ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందుకు సాగారు. ఈ పయనంలో కె.కేశవరావు వంటి మిత్రులు ఆయనకు దన్నుగా నిలిచారు. “వివాహబంధం, మిస్టర్ భరత్, రాగలీల” వంటి చిత్రాలను నిర్మించినా, అనూహ్య విజయాలేవీ దక్కలేదు. జంధ్యాల దర్శకత్వంలో ‘వివాహభోజనంబు’ తెరకెక్కించారు జయకృష్ణ. ఈ సినిమా లాభాలు చూపింది. తరువాత వచ్చిన ‘నీకూ నాకూ పెళ్ళంట’ అలరించలేకపోయింది. ‘420’ అనే చిత్రం అందించారు, అదీ అంతే సంగతులు అనిపించింది. దాదాపు దశాబ్దం తరువాత శ్రీహరి కాల్ షీట్స్ ఇవ్వడంతో ‘దాసు’ నిర్మించారు జయకృష్ణ. ఆ చిత్ర నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఫైనాన్సియర్స్ వద్ద వడ్డీలు పెరిగిపోయాయి. తరువాత ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. ఏది ఏమైనా ఒకప్పుడు నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన జయకృష్ణ చివరలో నిర్మించిన చిత్రాల ద్వారా నష్టాలు చవిచూశారు. కానీ, ఆయన నిర్మించిన చిత్రాలు కొన్ని జనం మదిలో చోటు సంపాదించాయి. ‘రూపశిల్పి’గా జయకృష్ణ స్థానమూ చెక్కు చెదరలేదు.