Site icon NTV Telugu

Dil Raju: ‘కాంతార’ తరహాలో ‘లవ్ టుడే’ థియేటర్లను షేక్ చేయడం ఖాయం

Love Today

Love Today

Dil Raju: టాలీవుడ్‌లో కాంతార మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కన్నడ డబ్బింగ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీగా లాభాలను చవిచూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో డబ్బింగ్ సినిమా కూడా కాంతార తరహాలో హిట్ అవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి నమ్మకంతో కనిపిస్తున్నాడు. తమిళంలో ఈనెల 4న విడుదలై భారీ వసూళ్లు రాబడుతున్న లవ్ టుడే మూవీని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి ఈనెల 25న దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో లవ్ టుడే సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తమిళనాడులో లవ్‌టుడే చిన్న సినిమాగా విడుదలై రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. ప్రేమ ఈరోజుల్లో ఎలా ఉంటుందో ఈ మూవీలో బాగా చూపించారని ప్రశంసించాడు. ఇటీవల దేశవ్యాప్తంగా కాంతార గురించి అందరూ మాట్లాడుకున్నారని.. అలాగే లవ్ టుడే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు.

Read Also: Pawan kalyan: రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్.. బహుశా అందుకేనేమో

నిజానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించినా.. తెరపై హీరో చేసి మేజిక్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు వివరించాడు. టాలీవుడ్‌లో ఈ మూవీ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా లవ్ టుడే మూవీ విజయానికి ప్రధాన కారణమైంది.

Exit mobile version