నిర్మాత బన్నీ వాస్‌పై సునీత బోయ అనే మహిళ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బన్నీ వాస్ అధికారిక ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి సునీత బోయ, గీతా ఆర్ట్స్ సంస్థ, అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ఆరోపణలు ఎంతో కాలంగా చేస్తోందని తెలిపారు. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు, యూట్యూబ్ లింక్‌లను చూడవచ్చన్నారు.
అయితే సునీత ఆరోపణలపై బన్నీ వాస్ తొలుత స్పందించలేదని.. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేశారని, కానీ దానిని అలుసుగా తీసుకుని సునీత గీతా ఆర్ట్స్ సంస్థతో పాటు బన్నీ వాసు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను కూడా రాతల్లో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. అంతటితో ఆగకుండా బన్నీ వాస్ నాలుగు సంవత్సరాల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సునీత ఒక వీడియోను పోస్ట్ చేసిందని, దాంతో మరో దారి లేక బన్నీ వాస్ న్యాయబద్ధంగా పోరాడాలని పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేశారని వాస్ ప్రతినిధి తెలిపారు.
తాజాగా పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్‌పై మరింత పగ పెంచుకున్న సునీత బోయ తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లిందని, తనను లైంగిక వేధింపులకు గురి చేసాడని కొత్త కట్టుకథతో ముందుకొచ్చిందని, ఇదంతా పూర్తిగా అబద్ధమని బన్నీ వాస్ తెలియజేశారన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ కదలికలను ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన సునీత బోయ చాలాసార్లు ఆయనపై దాడులకు కూడా ప్రయత్నం చేసిందని, అందుకే ఆయన ఫిర్యాదు మేరకు ఆమె 3 నెలల పాటు విజయవాడ సబ్ జైలులో శిక్ష అనుభవించింద’ని వారు చెప్పారు. ఆ కోపంతో మరింత తీవ్రస్థాయిలో సునీత వేదింపులు మొదలు పెట్టిందని తెలిపారు. అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని బన్నీ వాస్ తరఫున ప్రతినిధి మీడియాకు మనవి చేశారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని బన్నీ వాస్ వివరిస్తారని ప్రతినిధి స్పష్టం చేశారు.