కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదలైన ఈ సినిమాపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్. ఈ చిత్రంలో ఐజీ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తాడు. సౌత్ భాషల్లో విడుదలైన ప్రకారం ఆ సమయంలో ఆ సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతని చెంప పగలగొట్టి, స్థానిక భాషలో మాట్లాడమంటాడు. అయితే హిందీలో మాత్రం ఈ సన్నివేశాన్ని ‘నిజం చెప్పు’ అనేలా డబ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ సీన్ పై కాంట్రవర్సీ మొదలైంది. హిందీ భాషను తక్కువ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
Read Also : “జై భీమ్” సునామీ… సీఎం నుంచి ప్రేక్షకుల దాకా అందరూ ఫిదా
అయితే చిత్ర బృందం మాత్రం తమకు అలాంటి ఉద్దేశం లేదని, కేవలం కథాపరంగానే ఆ సన్నివేశం వచ్చిందని సమాధానం చెప్తున్నారు. ఈ చిత్రంలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం, అణగారిన వర్గాలు అధికారుల మూర్ఖత్వానికి ఎలా బలవుతున్నారు ? చేయని తప్పుకు ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నారు ? అనే విషయాల కోసం పోరాడే న్యాయవాదిగా నటించారు. సూర్య తొలిసారిగా న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నాడు. “జై భీమ్” సామాజిక, రాజకీయ అంశాలతో కథ ముడి పడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కన్పించారు. “జై భీమ్”కు సంగీతం సీన్ రోల్డాన్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కధీర్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ అందించారు.